వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అంతా సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో.. రాబోయే ఎన్నికలు, దేశంలో ప్రస్తుత పరిణామాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. శ్రేణులకు అగ్రనేతలు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పదాధికారుల సమావేశంలో చర్చ సాగుతోంది.. ఆ తర్వాత వాటిని ఆమోదించే తీర్మానాలు-అజెండాను ఖరారు చేస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హెచ్‌ఐసీసీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. అలాగే మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతాయి. తెలంగాణ నుంచి 14 మందితో సహా దేశం నలుమూలల నుంచి మొత్తం 350 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇక, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యవర్గ సమావేశాల ప్రాంగణం రూపుదిద్దుకుంది. తెలంగాణ ప్రాంతంలోని ముఖ్యమైన ప్రాంతాలు, వ్యక్తుల పేర్లను ఆయా ప్రాంగణాలకు పెట్టి తెలంగాణ కల్చర్ ఉట్టిపడేలా ప్లాన్ చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్‌ఐసీసీ, నోవాటెల్ ప్రాంతానికి శాతవాహన నగరంగా.. సమావేశ స్థలానికి కాకతీయ ప్రాంగణంగా నామకరణం చేశారు. భోజనశాలకు భాగ్యరెడ్డివర్మ ప్రాంగణంగా… మీడియా హాల్‌కు షోయబుల్లాఖాన్ హాల్ అని… అతిథులు బస చేసే ప్రాంగణానికి సమ్మక్క, సారలమ్మ నిలయంగా పేరు పెట్టారు.
Read Also: BJP V/s TRS: ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్.. అటు వాళ్లు.. ఇటు వీళ్లు
మరోవైపు, కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్‌ఐసీసీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. దాదాపు 5 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. హెచ్‌ఐసీసీ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. నో ఫ్లై జోన్‌గా ప్రకటించి.. నాలుగంచెల భద్రత కల్పించారు. ప్రధాని మోడీ పాల్గొనే ఈ కార్యక్రమం మొత్తం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. ఇక, ఎటూ చూసిన పార్టీ జెండాలు, బ్యానర్లు, హోర్డింగ్‌లతో నగరం మొత్తం కాషాయ వర్ణంలోకి మారిపోయింది. కార్యవర్గ సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ బీజేపీ.. ఎక్కడ లోటు లేకుండా చూసుకుంటోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పార్టీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలతో తెలంగాణలో బీజేపీ మరింత పుంజుకుంటుందని.. కీలక మార్పులు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.
కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ సిటీకి వస్తున్నారు… రెండు రోజులు ఇక్కడే ఉండనున్నారు. రేపు పరేడ్ గ్రౌండ్‌లో జరిగే విజయ సంకల్ప సభలో పాల్గొంటారు ప్రధాని. ఇవాళ మధ్యాహ్నం 12. 45 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరుతారు. 2.55 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. 3 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి.. 3.20 గంటలకు నోవాటెల్‌కి వెళ్తారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు హెచ్‌ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు ప్రధాని మోడీ. రేపు కూడా హైదరాబాద్‌లోనే ఉండనున్న ప్రధాని.. ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. ఆ తరువాత 6 గంటల 15 నిమిషాలకు ప్రత్యేక హెలీకాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తారు. అక్కడి నుంచి 6.30 గంటలకు రోడ్డుమార్గంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు చేరుకుంటారు. ఏడున్నర వరకు సభలోనే ఉండనున్న మోడీ.. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ పూర్తయ్యాక రాత్రి రాజ్‌భవన్‌లో బస చేస్తారు.
విజయ సంకల్ప యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. దాదాపు 10 లక్షల మందిని తరలించేలా ప్లాన్ చేస్తోంది. బీజేపీ ముఖ్యమంత్రులు అందరూ ఈ సభకు హాజరు కానున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని కూర్చునే స్టేజ్‌పైనే 8 మందికి స్థానం కల్పించనున్నారు. ప్రధాని ఉండే ప్రధాన వేదికపైన అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్‌తో పాటు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉండే అవకాశాలున్నాయి. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అందులో భాగాంగానే ఈ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్-బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. రెండు పార్టీలు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. రేపటి సభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడతారన్నది ఆసక్తిరేపుతోంది. ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతోన్న నేపథ్యంలో ఎటు చూసిన బీజేపీ శ్రేణుల కోలాహలం, కాషాయమయంతో భాగ్యనగరం సందడిగా మారింది. ఎటూ చూసిన పార్టీ జెండాలు, బ్యానర్లు, హోర్డింగ్‌లతో నగరం మొత్తం కాషాయ వర్ణంలోకి మారిపోయింది. కార్యవర్గ సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ బీజేపీ.. ఎక్కడ లోటు లేకుండా చూసుకుంటోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పార్టీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలతో తెలంగాణలో బీజేపీ మరింత పుంజుకుంటుందని.. కీలక మార్పులు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.
