ఉత్తరాది రాష్ట్రాల్లో తన పర్యటనను మొదలుపెట్టినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తుతోన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.. మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద మంత్రులకు, ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదని.. అసలు ఆయన్ను భరించే శక్తి వారికి లేదని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని, వాళ్ళకు వాళ్ళే కూల్చుకుంటారన్నారు. ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చని.. ఆ భయంతోనే ఢిల్లీ పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని, కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు.
హరీశ్ రావుకు ప్రేమతో మంత్రి పదవి ఇవ్వలేదని, ఆయన మీదున్న భయంతోనే ఇచ్చారని ఈటెల ఆరోపించారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటనకు పెద్దగా రెస్పాన్స్ రాలేదని చెప్పిన ఈటెల రాజేందర్.. జాతీయ నాయకులు కేసీఆర్‌తో కలిసి పని చేయడానికి ఇష్టంగా లేరని అభిప్రాయపడ్డారు. కాగా.. అంతకుముందుకు కేసీఆర్‌కు తెలంగాణలో పాలించడం చేతకాకే జాతీయ రాజకీయాలపై పడ్డారన్నారు. పరిపాలించే సత్తా, సమస్యలు పరిష్కరించే దమ్ము లేకపోయినా.. దేశాన్ని ఉద్ధరిస్తానని సీఎం కేసీఆర్ గొప్పలు పోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. ఏటా రూ.25వేల కోట్ల భారం ప్రజలపై మోపారని ఈటెల రాజేందర్ విమర్శించారు.