టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. జనగామ జిల్లాలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ధరణి వెబ్‌సైట్ రైతాంగానికి శాపంగా మారిందని ఆరోపించారు. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూదాన్, ల్యాండ్ సీలింగ్ భూములపై కేసీఆర్ కన్ను పడిందని, ల్యాండ్ పుల్లింగ్ పేరుతో భూములను గుంజు కుంటూ, ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతూ ప్రభుత్వం కూడా బ్రోకర్ పని చేస్తోందని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ కొత్త అవతారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బ్రోకర్ గా మారాడని, హైదరాబాద్‌లో లక్షల ఎకరాలు అమ్ముకున్న ర్తెతులు ఫౌం హౌజ్ ల ముందు వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ పుల్లింగ్ పేరుతో కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. ప్రజా సంగ్రామ ముగింపు సభను జయప్రదం చేయండని బీజేపీ కార్యకర్తలకు, నేతలకు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.