Errabelli Dayakar Rao Fires On PM Modi Governor Tamilisai: బీజేపీ నేతలు పచ్చి మోసగాళ్లని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ధ్వజమెత్తారు. మునుగోడు జనం బీజేపీకి మంచి గుణపాఠం చెప్పారన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధుల్ని ఆపంది ప్రధాని మోడీనేనని విరుచుకుపడ్డారు. మోడీ తెలంగాణకు రావద్దని తాము అనడం లేదని.. ప్రధానిగా ఏం చేశారనేది చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉందని పేర్కొన్నారు. తెలంగాణకు వచ్చే ముందు.. రాష్ట్రానికి ఏమిచ్చారో, ఏమిస్తారో చెప్పాలన్నారు. రామగుండం ఫ్యాక్టరీ ఏడాది కిందటే ప్రారంభమైందని.. ఇప్పుడు మళ్లీ దాన్ని ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తమకు సంబంధం లేదని చెప్తున్న బీజేపీ.. ఇప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లారు? విచారణ ఆపాలని ఎందుకు అంటున్నారు? అని నిలదీశారు. విచారణ చేస్తేనే కదా.. అసలు రహస్యాలు బయటపడతాయని తెలిపారు. స్వామిలను కూడా బీజేపీ మోసం చేస్తోందని మండిపడ్డారు. ఇక గవర్నర్ వివాదంపై స్పందిస్తూ.. ఓ గవర్నర్, గవర్నర్ లెక్కే ఉండాలని ఎర్రబెల్లి తెలిపారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటేనే మంచిదని హితవు పలికారు. లేకపోతే.. ఎన్టీఆర్ హయాంలో జరిగినట్టే జరుగుతుందని హెచ్చరించారు. టీడీపీపై చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడే, ఇక్కడే వ్యవహారం క్లోజ్ చేసుకొని ఏపీకి వెళ్లిపోయారన్నారు. ఎన్టీఆర్‌ను తాను ఎక్కువగా ఇష్టపడతానని, చంద్రబాబు లాంటి వాళ్లు మధ్యలో వచ్చి వెళ్తుంటారని అన్నారు. టీడీపీ జెండా తయారు చేసిన వారిలో తానూ ఒక ఫౌండర్‌నని చెప్పారు.
అంతకుముందు కూడా.. ఎర్రబెల్లి దయాకరరావు బీజేపీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చారన్నారు. అమిత్ షా చెప్పులను బండి సంజయ్ మోశాడు కాబట్టే.. ఢిల్లీ వరకు తెలిసేలా మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టినట్టు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. రాజగోపాల్ రెడ్డిని బీజేపీ రూ. 18 వేల కోట్లకు కొనుగోలు చేసి, ఆయన్ను బలి పశువును చేసిందని విమర్శించారు. తెలంగాణలోని 7 మండలాల్ని ఏపీలో కలపడం, రాష్ట్ర విభజన హమీలు విస్మరించడం, కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వకపోవడం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోతవిధించడం వంటివి.. బీజేపీ కుట్రకు నిదర్శనమని చెప్పారు. బీజేపీ డబ్బులిచ్చి ఎమ్మేల్యేలను కొనాలని చూస్తోందని.. కానీ బియ్యం కొనమంటే మాత్రం తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పాలంటోందని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి అనుమతులు తేలేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సిగ్గు లేదని.. కరీంనగర్‌లో కనీసం ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి సంజయ్ అని విమర్శించారు.