MLA Lakshmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకుంటు ముందుకు సాగుతున్నారు. ఈనేపథ్యంలో.. నాగర్‌కర్నూల్ జిల్లా ఉరుకొండ మండలం మాదారం గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్థానిక మండల నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర ఏళ్లలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్ కేటాయిస్తూ, ప్రతిరోజు చెత్తను సేకరిస్తూ, డ్రైనేజీలు సిసి రోడ్లు ఏర్పాటు చేసి గ్రామాల రూపు రేఖలు మార్చామని తెలిపారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు ఏర్పాటుచేసి అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాలను కాపాడుకుంటున్నామని తెలిపారు. కనీసం 7 గంటల కరెంటు కూడా సక్రమంగా సరఫరా చేయకుండా అన్నదాతలను ఆగం చేసిన గత ప్రభుత్వాలు కావాలా? నిరంతరంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందజేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కావాలా? అని రైతులు ఒక్క క్షణం ఆలోచించుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు.
పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ చీకటి రోజులే పునరావృతం అవుతాయని ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలని కోరారు. కరెంట్ ఎప్పుడు వస్తది ఎప్పుడు పోతదో తెలియక పొలాల కాడే పడిగాపులుకాస్తూ అన్నదాతలు ఎన్ని అవస్థలు పడ్డారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. మరి నేడు ఆ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? రైతుల ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వచ్చేది మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వమే అని అభివృద్ధి సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని భరోసానిచ్చారు. పలువురు మహిళలతో మాట్లాడుతూ… కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు మరింత ప్రాధాన్యతను కల్పిస్తూ సౌభాగ్యలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా మూడు వేలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారాని ఎమ్మెల్యే అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలని, పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. నవంబర్ 30 నాడు జరిగే ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేసారు.