తమ భూముల వ్యవహారంలో మెదక్ కలెక్టర్ హరీష్ చేసిన వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల భార్య జమున స్పందించారు. జమున హేచరీస్‌కు సంబంధించిన భూములను ఈటల బలవంతంగా ఆక్రమించుకున్నారని కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమన్నారు. భూముల అంశం కోర్టు పరిధిలో ఉందని… తమకు ఎటువంటి వివరాలు ఇవ్వకుండా కలెక్టర్ హరీష్ ప్రెస్ మీట్ ఎలా పెడుతారని జమున ప్రశ్నించారు. కలెక్టర్లు ప్రెస్ మీట్ పెట్టడానికే ఉన్నారా? కలెక్టర్ ఏమైనా రాజకీయ నాయకుడా? టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్లర్క్‌గా పనిచేస్తున్నారా? అంటూ గట్టిగా నిలదీశారు. ఈ విషయంలో కలెక్టర్ మీద కేసు పెడతామని జమున స్పష్టం చేశారు.
Read Also: వీడియో డేటింగ్‌లలో అగ్రస్థానంలో హైదరాబాద్
ఎలాంటి సమస్యలు లేని భూములే ధరణి వెబ్‌సైట్‌లో రికార్డు చేయబడతాయని… 2019లో తాము అలాంటి భూములనే కొనుగోలు చేశామని జమున తెలిపారు. లాయర్ ద్వారా ఆ భూములను తాము లీగల్‌గా రిజిస్ట్రేషన్ చేసుకున్నామని వివరించారు. కలెక్టర్ వ్యాఖ్యల ప్రకారం.. ధరణి వల్ల ఉపయోగం లేదా? అందులో ఉన్న భూములన్నీ ఫేకేనా అని జమున నిలదీశారు. సర్వే నెంబర్ 81లో తమకు ఉన్నది 5 ఎకరాల 30 గుంటలే.. సర్వే నెంబర్ 130లో మూడు ఎకరాలు ఉంది.. కానీ కలెక్టర్ మాత్రం 70 ఎకరాలు ఆక్రమించారని చెపుతున్నారు. తాము ఎవరి దగ్గర భూమి గుంజుకుని రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటూ జమున వివరణ ఇచ్చారు. మహిళల సాధికారతపై మాట్లాడే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మహిళా వ్యాపారవేత్తపై దాడి చేయడం సరైన పద్ధతి కాదని ఆరోపించారు. తన భర్త ఈటల రాజేందర్ 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నారని… అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ అధికారికైనా ఈటల ఫోన్ చేశారా? అధికారులకు ఫోన్ చేసి భూములు ఆక్రమించుకున్నారా? అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ ఆక్రమించుకోని వారు ఇప్పుడే ఆక్రమించుకున్నారని ఎందుకు చెప్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జమున నిలదీశారు.