Dusari Lavanya Srinivas Goud Held Celebrations At Amberpet After BRS Party Announcement: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాష్ట్ర పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన సందర్భంగా.. అంబర్‌పేట్ గోల్నాక డివిజన్‌లో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ హాజరై.. స్వీట్లు పంచి, బాణాసంచాలు కాల్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ తలపెట్టిన భారత్ రాష్ట్ర సమితి పార్టీ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లాలని కోరారు. యావత్ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల ప్రజలు కోరుకునే విధంగా ఈ పార్టీ అవతరించాలని ఆశించారు.
దేశాన్ని రక్షించేవాడు జవాన్ అయితే.. 140 కోట్ల ప్రజలకు అన్నం పెట్టేది కిసాన్ అని.. కిసాన్‌ని ఎజెండాగా, జెండానే ఎజెండాగా తెలంగాణ మోడల్స్‌ని యావత్ భారతదేశ రైతాంగానికి అందించాలన్న కాంక్షతోనే ఈ పార్టీని స్థాపించారని లావణ్య పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కంకణబద్ధులై.. ఈ దేశంలో పేదరికం ఉండొద్దని, అందంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారన్నారు. మన భారతదేశం.. అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల సరసన ఆర్థికంగా బాగుపడాలంటే.. దేశ రాజకీయాల్లో కేసీఆర్ ముందడుగు వేయాల్సిందేనన్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇదిలావుండగా.. అక్టోబర్ 5వ తేదీన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం, ప్రతినిధులు దానికి ఆమోదం తెలపడంతో.. తన గులాబీ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. పలు రాష్ట్రాల నేతల సమక్షంలో ఈ ప్రకటన చేసిన ఆయన.. ఇకపై బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యిందని విమర్శించిన కేసీఆర్.. తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాలని పిలుపునిచ్చారు.