తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ నియామక ప్రక్రియపై మళ్లీ పంచాయతీ మొదలైంది. పదవి నాకు కావాలి.. అంటే నాకు అంటూ పోటీ పడుతున్నారు నేతలు. పదవి కోసం పోటీ పడటం సహజమే. అయితే, నాకు పదవి వచ్చినా రాకపోయినా… పక్కోడికి మాత్రం రావొద్దు అనే తరహా ఫిర్యాదులు చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఎవరికి వారు… తమ పంతాన్ని నెగ్గించుకునే పనిలో పడ్డారు. పార్టీ క్లిష్ట కాలంలో పదవి కోసం పోటీ చూసి సంతోష పడాలో… తన్నులాట చూసి బాధపడాలో తేల్చుకోలేక పోతుంది క్యాడర్. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కావాల్సిందేనని పట్టు పడుతున్న వారిలో… కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేవంత్ రెడ్డి ముందున్నారు. ఇక నాక్కూడా పిసిసి కావాలని అడిగే వారిలో వీహెచ్.. జగ్గారెడ్డి కూడా ఉన్నారు. అయితే… మనసులో పీసీసీ కావాలని ఉన్నా… బయటకు మాత్రం చెప్పరు. తన టీంతో మాత్రం పిసిసి కోసం ప్రయత్నాలు చేస్తారు మరో నాయకుడు. ఇలా పార్టీలో నాయకులు కూడా చీలిపోయారు. ఉత్తమ్ రాజీనామా చేసినప్పటి నుండి… అభిప్రాయ సేకరణలో మెజారిటీ నాయకులు రేవంత్ పేరే ప్రతిపాదించారు… కాబట్టి ఆయనకే పిసిసి ఇవ్వాలి అనే వారు రేవంత్ టీం. దీంట్లో మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు ఉన్నారు. ఈ టీం అంతా.. ఇప్పటికే చేయాల్సిన ప్రయత్నాలు చేసింది… చేస్తూనే ఉంది. ఎదుటి పక్షంలో ఉన్న నాయకులను టెంప్ట్ కూడా చేస్తున్నారు. దీనిపై పార్టీలో సీనియర్ నాయకులు… విమర్శలకు కూడా దిగారు. ఇలా ఇదో వర్గంగా మారిపోయింది.
ఇక పిసిసి ఆశిస్తున్న మరో నాయకుడు ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎన్‌ఎస్‌యూఐ నుంచి పని చేస్తూ వస్తున్నానని… తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని… జనంలో తనకే అక్సెప్తెన్సి ఉంటుందని కోమటిరెడ్డి మద్దతుదారులు చెప్తున్నారు. బీసీలకు పిసిసి అవకాశం లేకుంటే… కనీసం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి పదవి ఇవ్వండి అని వీహెచ్ లాంటి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు మళ్లీ పిసిసి చీఫ్ ఎంపిక తెరమీదకు రావడంతో.. కోమటిరెడ్డి తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. డీసీసీ అధ్యక్షులు… పార్టీలో సీనియర్ నాయకులతో ఇంఛార్జి ఠాగూర్‌కి ఎస్‌ఎంఎస్‌లు… పంపిస్తున్నారట. రేవంత్‌ని వ్యతిరేకించే టీంలో కొందరు… కోమటిరెడ్డికి మద్దతు ఇస్తున్నారు. ఇలా ఇదొక గ్రూప్‌గా మారిపోయింది. మరోవైపు… వీరికి తోడు…సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పిసిసి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే… అది తన కోసం కాదు శ్రీధర్ బాబు కోసం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఎవరికో ఒకరికి పిసిసి ఇవ్వండి… కాంగ్రెస్ కుటుంబం నుండి వచ్చిన వారు కాబట్టి పార్టీకి లాయల్‌గా ఉంటారని ఓ టీం పని చేస్తోంది. కొందరు డీసీసీలు… మాజీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖలు రాయటానికి కూడా రెడీ అవుతున్నారట. శ్రీధర్ బాబుకు ఇవ్వలేక పోతే… సిఎల్పీ నేత భట్టిని సూచిస్తున్నారు. అయితే…భట్టి మాత్రం… తాను పిసిసిగా కాదు… సిఎల్పీ నేతగానే నిరూపించుకుంటా… అంటున్నారు. బయటకు ఇలా చెప్తున్నా… ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారనే భట్టి వ్యతిరేక టీం ప్రచారం చేస్తోంది. ఇలా పార్టీ పిసిసి పదవి ఆశిస్తున్న వారంతా గ్రూపులుగా విడిపోయారు. అధిష్టానానికి మాత్రం ఇప్పటికే ఓ నివేదిక వెళ్లిందని…ఈ వారంలో ప్రకటన కూడా వచ్చేస్తుందని ధీమాలో ఓ వర్గం ఉంది. పార్టీ సంగతి ఎలా ఉన్నా…పిసిసి పంచాయతీ మాత్రం కాంగ్రెస్‌ని చీలికలు…పీలికలుగా మార్చేసింది. పిసిసి నియామకం కంటే ముందే పరిస్థితి ఇలా ఉంటే…నియామకం జరిగితే ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆసక్తికరమైన అంశంగా మారింది.