NTV Telugu Site icon

Dharmapuri Arvind : అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తోన్న హైడ్రాను.. ఓల్డ్ సిటీలో అమలు చేయగలరా..?

Dharmapuri Arvind

Dharmapuri Arvind

Dharmapuri Arvind : హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించిన నిజామాబాద్ ఎంపీ డి. అర్వింద్ కుమార్, ఓల్డ్ సిటీలో కూడా ఇదే తీరుగా చర్యలు తీసుకోవాలా? అని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజమైన ధైర్యముంటే ఓల్డ్ సిటీలో అడుగుపెట్టగలరా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆదివారం నిజామాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ-ముస్లింలపై ఆదాయంపై ఆధారపడి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో భూ స్థాపితమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఇక ప్రజల్లో ఆదరణ లేదని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ శకం ముగిసిపోయిందని అన్నారు.

భారతదేశాన్ని కాషాయమయం చేయడమే తన లక్ష్యమని స్పష్టంగా వెల్లడించిన ఎంపీ అర్వింద్, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు బాధ్యతగా ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శిస్తూ, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కుల రాజకీయాలు మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించిన ఎంపీ అర్వింద్, ప్రధాని మోడీని విమర్శించే స్థాయి రేవంత్‌కు లేదన్నారు. హామీలు నెరవేర్చలేక రేవంత్ రెడ్డి అవాస్తవ ప్రచారం చేస్తోన్నారని ఆరోపించారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని గుర్తు చేస్తూ, తెలంగాణ ప్రజలు కూడా త్వరలో అదే విధంగా తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ సైతం నిజామాబాద్‌లో మాట్లాడుతూ, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు సత్తా లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు కీలక మలుపు తిప్పబోతున్నాయని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆదరణ కోల్పోయిందని, దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం కొనసాగుతోందని అన్నారు. ఉద్యోగాలు కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు ఓటు ఎందుకు వేస్తారని ప్రశ్నించారు.

కుల గణన పేరుతో బీసీల హక్కులను హరించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించిన అర్వింద్, ముస్లింల కోసమే ఈ గణన చేపడుతున్నారని మండిపడ్డారు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం తిరిగి సర్వే ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రజలను విసిగించిందని, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కుల రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Minister Seethakka: ఎస్టీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం..