Dasyam Vinay Bhasker Filed Complaint On Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బండి సంజయ్‌కు పిచ్చి లేసిందని, అందుకే కుక్క లెక్క మొరుగుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుద్ధ భవన్‌లో సీఈవో వికాజ్ రాజ్‌కు బండి సంజయ్‌పై ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడిన వినయ్ భాస్కర్.. రోజు రోజుకి పిచ్చి కుక్క కంటే బండి సంజయ్ అద్వాన్నంగా తయారు అవుతున్నాడంటూ విమర్శించారు. దేవుడితో సమానమైన సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. కేసీఆర్ క్షుద్రపూజలు చేశారన్న తప్పుడు వ్యాఖ్యలతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీకి తెలంగాణలో రోజురోజుకు ఆదరణ తగ్గుతుండడంతో.. అది చూసి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ తన పద్ధతి మార్చుకునేలా లేడని.. అందుకే సీఈవో వికాస్ రాజ్‌ను కలిసి, ఆయనపై ఫిర్యాదు చేశామన్నారు.
ఇక ఇదే సమయంలో.. మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ సింబల్‌ను పోలిన 8 కారు గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని తాము సీఈవోని కోరామని వినయ్ భాస్కర్ తెలిపారు. గతంలో కారును పోలిన సింబల్స్ ఉండటంతో.. స్వల్ప మెజార్టీతో తమ అభ్యర్థులు ఓడిపోయారని, అందుకే అలాంటి 8 గుర్తులను తొలగించాలని కోరామని చెప్పారు. కాగా.. దాస్యం వినయ్ భాస్కర్‌తో పాటు ఎమ్మెల్సీ భాను ప్రసాద్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జనరల్ సోమ భరత్ కుమార్ కూడా సీఈవోని కలిశారు.