Site icon NTV Telugu

Dasoju Sravan : సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు.!

Dasoju Sravan

Dasoju Sravan

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ను కలిసి ముఖ్యమంత్రిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను “100 అడుగుల భూమిలోకి తొక్కిపెట్టాలి” అని రేవంత్ రెడ్డి మాట్లాడటంపై శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ సాధించిన నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ దౌర్జన్యమని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

Ratha Saptami Celebrations : రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల

నోటికి హద్దులు లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్‌ఎస్ పార్టీని కూల్చేస్తానని, బీఆర్‌ఎస్ దిమ్మెలను టీడీపి నాయకులు కూలగొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం ఇరు పార్టీల మధ్య గొడవలకు దారితీస్తోందని శ్రవణ్ ఆరోపించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి ఇటువంటి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని ఆరోపించారు.

సికింద్రాబాద్ అస్థిత్వంపై ప్రశ్నించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై కేసులు పెట్టినప్పుడు, మరి కేసీఆర్‌ను బొందపెడతామన్న ముఖ్యమంత్రిపై ఎందుకు కేసులు పెట్టరని శ్రవణ్ ప్రశ్నించారు. తలసానిపై ప్రయోగించిన అదే సెక్షన్లను రేవంత్ రెడ్డిపై కూడా వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తూ.. “ఆయన శరీరం కాంగ్రెస్‌ది, కానీ ఆత్మ మాత్రం టీడీపీది” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసుతో తెలంగాణలో టీడీపీ పతనానికి రేవంత్ రెడ్డే బీజం వేశారని, ఇప్పుడు బీజేపీ-టీడీపితో చీకటి రాజకీయాలు చేస్తూ తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. 1200 మంది అమరుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేడు తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం తగదని హెచ్చరించారు.

యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ బీస్ట్ గా రాబోతున్న iQOO 15 Ultra.. లాంచ్ ఎప్పుడంటే..?

Exit mobile version