Investment Fraud : సైబరాబాద్ పరిధిలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని అమాయకులను నమ్మబలికి కోట్ల రూపాయలు కాజేసిన ఘనకాండ వెలుగు చూసింది. AV ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ డైరెక్టర్ తిమ్మిరి సామ్యూల్ ఈ మోసానికి పాల్పడగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ సంస్థ ద్వారా సామ్యూల్ సుమారు 25 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఈ మోసానికి పాల్పడిన సామ్యూల్‌తో కలిసి గోగుల లక్ష్మీ విజయ్‌కుమార్ కూడా సంస్థను ప్రారంభించగా, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.
Pakistan: పాక్ మిస్సైల్ విఫలం.. సొంత ప్రజలపైనే కూలిన షాహీన్-3 క్షిపణి..
ఈ సంస్థ ప్రజలను ఆకర్షించేందుకు ‘ప్రీ-లాంచ్ ఆఫర్లు’, ‘బై బ్యాక్ ఆఫర్లు’ పేరుతో మాయ మాటలు చెప్పింది. 10 లక్షల పెట్టుబడి పెడితే ఏడాదిలో 15 లక్షలు ఇస్తామని, బై బ్యాక్ స్కీమ్‌లో 10 నుంచి 20 లక్షలు పెట్టుబడి పెట్టిన వారికి రిజిస్ట్రేషన్ అయిన భూమితో పాటు పెట్టుబడిలో సగం అదనంగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ వాగ్దానాలకు మభ్యపడి పెట్టుబడి పెట్టిన వారు చివరికి మోసపోయారని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుల మేరకు సామ్యూల్‌ను అరెస్ట్ చేయగా, లక్ష్మీ విజయ్‌కుమార్ కోసం వెతుకులాట కొనసాగుతోంది.
ఇదే తరహా మోసం మరో సంస్థ ద్వారా కూడా వెలుగుచూసింది. ఫిబ్ వేవ్ అనలిటిక్స్ అనే నకిలీ కంపెనీ పెట్టుబడిదారులను ఆకర్షించి సుమారు 6.5 కోట్ల రూపాయలు కాజేసింది. ఏడాదిలో 30 నుంచి 48 శాతం అదనపు లాభాలు ఇస్తామని చెప్పి స్నేహితులు, బంధువులు, తోటి ఉద్యోగులను మోసగించింది. ఈ మోసానికి ప్రధాన నిందితుడు సైరస్ హార్మస్జి పరారీలో ఉండగా, మరో నిందితుడు నిఖిల్ కుమార్ గోయల్ పోలీసుల చేతిలో చిక్కాడు.
సైబరాబాద్ పోలీసు పరిధిలో వరుసగా జరుగుతున్న ఈ మోసాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తామని ఎవరైనా హామీ ఇస్తే ఆఫర్లను జాగ్రత్తగా పరిశీలించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.