బీజేపీ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారు. అంతేకాకుండా కేంద్రమంత్రులు, బీజీపీ ప్రముఖులు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రత్యేక బందోబస్తును పోలీసుల ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 144 సెక్షన్‌లు అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. నాలుగు రోజుల పాటు బీజేపీ నాయకులు ఇక్కడ ఉంటున్నారని,ప్రధాని రాక సందర్భంగా అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
ఎస్పీజీ తో పాటు ఇతర బలగాలు బందోబస్తు లో ఉంటాయని, నోవాటెల్ పరిసర ప్రాంతాల్లో నాలుగు లేయర్ల బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ప్రధాని వెళ్లే రూట్లో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు.. గత రెండు రోజులుగా ఇతర ప్రాంతాల నుంచి యూనిట్లు కూడా వచ్చాయన్నారు.
అన్ని యూనిట్లతో సమన్వయం చేసుకుంటూ ఒక యూనిటీగా పనిచేయాలని చెప్పామని, లా ఆర్డర్, ట్రాఫిక్, ఏరియా డామినేషన్ పార్టీస్, రూఫ్ పార్టీస్ ను పెట్టామన్నారు. ఆర్అండ్ బీ, జిహెచ్ఎంసి అధికారులతో సమన్వయంగా పని చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతానికి రెండు ఆర్గనైజేషన్లు ప్రధాని టూర్లో ధర్నా చేస్తారన్న సమాచారం ఉందని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రశాంతంగా, సాఫీగా ప్రధాని పర్యటన సాగేలా చూస్తున్నామని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియా పైన ప్రత్యేక మానిటరింగ్ సెంటర్ ని ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు ఆ వింగ్ సోషల్ మీడియాలో పోస్టింగ్ చెక్ చేస్తూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని ఎక్కడ స్టే చేస్తారు అనేది సెక్యూరిటీ రీత్యా బయటకి చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు.