కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన వినాశనం ఇంకా మన కళ్లలో మెదులుతూనే ఉంది. ఆ పాపంలో ప్రభుత్వాల పాత్ర కూడా ఉంది. ఎన్నికల సభలు సూపర్ స్ప్రెడర్స్ గా మారాయి. తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా ఒక కారణం. ఇప్పుడు థర్డ్ వేవ్ పొంచి ఉన్న సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతోంది.
హుజూరాబాద్‌లో ప్రధాన ప్రత్యర్థులు ప్రచార వేగం పెంచారు. నేతల వెంట జనం గుంపులు గంపులుగా తిరుగుతున్నారు. దీంతో కరోనా మళ్లీ వ్యాపిస్తుందా అనే ఆందోళన మొదలైంది. అయితే ఈసారి అలా జరగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల సంఘం కూడా కరోనా నిబంధనలు విడుదల చేసింది. హుజురాబాద్‌లో నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. దాంతో అధికారులు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క డోసు టీకా అయినా ఇవ్వనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో జిల్లా వైద్య అధికారులు టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో 75 శాతం మందికి పైగా ఫస్ట్ డోస్ ఇచ్చారు. త్వరలో మిగిలిన 25 శాతం కూడా పూర్తి చేయన్నారు.
ఎన్నికల సంఘం ఆదేశాలకనుగుణంగా క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్ జోరు పెరుగుతోంది. అక్టోబరు మొదటి వారంలోగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని ఓటర్లకు టీకా మొదటి డోసు అందించాలని టార్గెట్. ఐదు మండలాల పరిధిలో ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు జాబితా ప్రకారం మొత్తంగా 2,36,283 మంది ఓటర్లున్నారు. ఇందులో మొదటి డోసు టీకాను 1,90,825 మంది అందుకున్నారు. రెండో డోసు విషయానికి వస్తే 64,915 మంది పూర్తి చేసుకున్నారు.
హుజూరాబాద్ ఎన్నికలకు నామినేషన్ గడవు ఈ నెల 8 వరకు ఉంది. ఆ తర్వాత ప్రచార ఉధృతి పెరుగుతుంది. అందుకే ఈ వారం రోజుల వ్యవధిలోనే అందరికి ఫస్ట్ డోస్ పూర్తిచేయాల్సి వుంటుంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండగా , ఒక మండలం హనుమకొండ జిల్లా పరిధిలో ఉంది. కరీంనగర్ జిల్లాలో 24 వేల 278 మందికి టీకా వేస్తే అనుకున్న లక్ష్యం పూర్తవనుంది. కమలాపూర్ మండలంలో 21,180 మందికి టీకా వేయించుకోవాల్సివుంది. ఈ ఎన్నికల పుణ్యమా అని 18 ఏళ్ల పైబడిన అందరూ టీకా తీసుకున్న రికార్డు హుజూరాబాద్ నియోజకవర్గ సొంతమవుతుంది.
మరో నాలుగైదు రోజుల్లో మొదటి డోస్ నూరు శాతం పూర్తవుతుంది. అయితే సెకండ్ డోస్ విషయంలోనే అధికారులకు ఇబ్బంది ఎదురవుతోంది. ఉదాహరణకు హుజూరాబాద్ మున్సిపాల్టీలో 18 సంవత్సరాలు నిండిన వయోజనులు 25 వేల 406 మంది ఉన్నారు. వారిలో 24 వేల 722 మంది..అంటే 97.33 శాతం ఫస్ట్ డోస్ తీసుకున్నారు. కాగా, కేవలం 8 వేల 908 మంది మాత్రమే రెండో డోస్ తీసుకున్నారు. రెండు లక్షల తొమ్మిది వేల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ అధికారులు తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేయించుకోవాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్ వి కర్నన్ ప్రకటించారు. దీంతో కరోనా వ్యాప్తి లింకు తెగి ఇన్ఫెక్షన్ తీవ్రత తగ్గుతుంది. అలాగే ఎన్నికల్లో పోటీచే అభ్యర్థులందరూ కనీసం ఒక్క డోసు టీకా అయినా వేయించుకోవాల్సివుంటుంది. అయితే ఎంత మంది నామినేషన్లు వేస్తారో తెలియదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న పలు సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి నిరసన తెలిపే అవకాశం ఉంది.
………