టీఆర్ఎస్ సర్కార్ పై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన పదికోట్ల ఆస్పత్రిని గత ఏడేళ్లుగా నిరుపయోగంగా టిఆర్ఎస్ సర్కార్ వదిలేసిందని.. కెసిఆర్ సర్కార్ వెంటనే ఖైరతాబాద్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆస్పత్రిగా మార్చి పేద ప్రజలందరికీ ఇన్-పేషెంట్ కరోనా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఎందుకు ఈ ఆస్పత్రులను పర్యటించి కోవిడ్ ఆస్పత్రులుగా మార్చడం లేదలని.. దాసోజు మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు చివరకు పావురాల ఆవాసాలుగా కేసీఆర్ సర్కార్ మార్చిందన్నారు. వరంగల్ సెంట్రల్ జైల్, ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతను పక్కనపెట్టి ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసి పేద ప్రజలకు కరోనా వైద్యం అందించాలని దాసోజు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లో పులిగా చలామణి అయిన దానం నాగేందర్ టిఆర్ఎస్ లో చేరి పిల్లిగా మారారని చురకలు అంటించారు. గత ఏడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఈ ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిచడం కోసం ముఖ్య మంత్రి కెసిఆర్ ను ఎందుకు ప్రశ్నించడం లేదని దానం నాగేందర్ పై ఫైర్ అయ్యారు.