Pragati Bhavan: ప్రగతి భవన్‌లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు పోలీసులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నవీన్‌రావు, సీఎంఓ అధికారులు, సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సీఎం కేసీఆర్ అమరజవాన్‌కు నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మరికాసేపట్లో గోల్కొండ కోటపై కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

అసెంబ్లీలో 7వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందన్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంపదను పెంచి పేదలకు పంచుతున్నారన్నారు. మహాత్మాగాంధీ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారన్నారు. కాగా, శాసనమండలిలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. మండలి ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, నవీన్ కుమార్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వాణీదేవి, దయానంద్, దండే విఠల్, పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు.

సిద్దిపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీష్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

77 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శాస్త్రినగర్ లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షాలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… బ్రిటిష్ సామ్రాజ్యాధికారుల నుండి దాస్య విముక్తి గావించడం కోసం ఎందరో వీరాధివీరులు, మహనీయులు తమ ప్రాణాలొడ్డి జీవితాలను అర్పించారని వారి సేవలను కొనియాడారు. వలస పాలన తర్వాత ఈ 77 ఏండ్లలో భారతదేశం అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అదే విధంగా సీయం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి బాటలో దూసుకుపోతుందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం వస్తుందని, 78 స్వాతంత్య్ర దినోత్స వేడుకల్లో కూడా సీయం కేసీఆర్ గోల్కొండ కోట నుంచి జాతీయ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Tuesday Remidies: అదృష్టం కలిసిరావడం లేదా?.. మంగళవారం నాడు ఈ చర్యలు చేస్తే డబ్బే డబ్బు!