Co Living Hostels: భాగ్యనగరంలోని ఐటీ హబ్‌గా పేరుగాంచిన మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పరిసరాల్లోని కో-లివింగ్ హాస్టల్స్ ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం అంజయ్యనగర్‌లోని ‘కో-లివ్ గార్నెట్ పీజీ హాస్టల్’ వేదికగా జరుగుతున్న డ్రగ్స్ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ (SOT) పోలీసులు, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో కో-లివింగ్ హాస్టళ్ల ముసుగులో సాగుతున్న చీకటి వ్యాపారం బయటపడింది. హాస్టల్‌పై ఆకస్మిక దాడి చేసిన పోలీసు బృందం, అక్కడ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు పెడ్లర్లతో పాటు వాటిని వినియోగిస్తున్న ముగ్గురు కన్జ్యూమర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ దాడుల్లో నిందితుల నుండి పోలీసులు అత్యంత ఖరీదైన 12 గ్రాముల MDMA డ్రగ్స్ , 7 గ్రాముల OG గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్లుగా వ్యవహరిస్తున్న కంభం వంశీ దిలీప్, బాల ప్రకాష్‌లను పోలీసులు అరెస్ట్ చేయగా, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ మణికంఠ ముచ్చు, రోహిత్ గౌడ్, తరుణ్‌లకు పరీక్షలు నిర్వహించగా డ్రగ్ పాజిటివ్ అని తేలింది. దీనితో వీరి ఐదుగురిపై ఎన్.డి.పి.ఎస్ (NDPS) చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేశారు. రాయదుర్గం, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో కో-లివింగ్ హాస్టల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, అక్కడ సరైన నిఘా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని డ్రగ్ మాఫియా పాగా వేస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే ‘కో-లివ్ గార్నెట్’ హాస్టల్లో గతంలో కూడా డ్రగ్స్ పట్టుబడటం గమనార్హం.
మరోవైపు, ఈ డ్రగ్స్ దందాపై ఆరా తీసేందుకు, వార్తలను కవర్ చేసేందుకు వెళ్లిన ఎన్టీవీ (NTV) మీడియా సిబ్బందిపై హాస్టల్ యజమానులు బరితెగించి దౌర్జన్యానికి దిగారు. హాస్టల్ వద్ద దృశ్యాలు చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను అడ్డుకోవడమే కాకుండా, వారిపై భౌతిక దాడికి ప్రయత్నించి తీవ్రంగా బెదిరించారు. కో-లివింగ్ హాస్టళ్ల యజమానులు ఇంతటి అక్రమాలకు పాల్పడుతూ, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం చేస్తుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో ఐటీ కారిడార్‌లోని హాస్టళ్లపై పోలీసుల నిఘా మరింత కఠినతరం చేయాలని, అరాచకాలకు పాల్పడుతున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.
Sabarimala Gold Theft: శబరిమల బంగారు దొంగతనంలో వెలుగులోకి సంచలన విషయాలు..!