CM Revanth Reddy : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల కార్యదర్శులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యం, సాగునీరు వంటి కీలక రంగాలకు నిర్దిష్టమైన పాలసీలు లేకపోవడం వల్ల పౌరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్ది స్పష్టమైన విధివిధానాలతో ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్రాన్ని మూడు విభిన్న జోన్లుగా అంటే ‘కూర్’ (CURE), ‘ప్యూర్’ (PURE), ‘రేర్’ (RARE) గా విభజించి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రణాళికలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలంటే అధికారుల మధ్య సమన్వయం అత్యంత అవసరమని ఆయన గుర్తు చేశారు. ఎంత గొప్ప పథకాలైనా శాఖల మధ్య సమన్వయ లోపం ఉంటే ఆశించిన ఫలితాలను ఇవ్వవని, అందుకే ప్రతి అధికారి జవాబుదారీతనంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
అధికారుల పనితీరుపై ఇకనుంచి నిరంతర నిఘా ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి నెలా కార్యదర్శుల పనితీరును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సమీక్షిస్తారని, ఇందుకు సంబంధించిన నివేదికలను అధికారులు ప్రతి నెలా తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించారు. తాను స్వయంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి అధికారుల పనితీరుపై ప్రగతి నివేదికలను పరిశీలిస్తానని తెలిపారు. పనుల్లో జాప్యాన్ని నివారించడానికి , శాఖల మధ్య సమన్వయం పెంచడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
SIR Effect: కేరళ, అండమాన్–నికోబార్, ఛత్తీస్‌గఢ్‌లో లక్షల సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగింపు..!