ఈనెల 31 నుంచి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కరోనా నేపథ్యంలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలను నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ.. పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్‌లో శానిటేషన్ పనులతో పాటు ఇతర ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ కూడా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తుంది.
Read Also: దళిత బంధు పై కేసీఆర్ మాటలు కోటలు దాటాయి: రఘునందన్ రావు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు తెలంగాణకు అన్యాయం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ అధ్యక్షతన రేపు (ఆదివారం) మధ్యాహ్నం 1 గంట కు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా.. లోక్ సభ, రాజ్య సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహలను సభ్యులకు సీఎం వివరించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలకు నివేదికలు అందజేయనున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, కేంద్రం పై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా సీఎం కేసీఆర్ ఎంపీలకు ఈ సమావేశంలో కీలక సూచనలు చేయనున్నారు.