ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలపై ప్రతి సారి అధికార పార్టీదే పై చేయి ఉంటున్న నేపథ్యంలో తాజాగా విపక్షాలు కూటమి అధికార పార్టీకి తలనొప్పిగా తయారైందని చెప్పొచ్చు. అయితే నేడు మరోసారి దేశరాజధాని ఢిల్లీలో భేటీ అయిన విపక్షాల కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించాయి. బీజేపీ నుంచి బయటకు వచ్చిన యశ్వంత్ సిన్హా ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే గత కొంత కాలంగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనలు, భేటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఏవైపు ఉంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. గతంలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచిన కేసీఆర్ ఈ సారి ఫెడరల్ ఫ్రంట్ అంటూ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ కూడా సీఎం కేసీఆర్ను రాష్ట్రపతి ఎన్నికలను మద్దతుగా ఇవ్వాలని కోరలేదు. ఇప్పుడు కేసీఆర్ ఎవరికి మద్దతిస్తారని ఉత్కంఠ కొనసాగుతుండగా విపక్షాల భేటీకి నేతృత్వం వహించిన ఎన్సీపీ నేత శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ మద్దతు కూడా యశ్వంత్ సిన్హాకేనని శరద్ పవార్ ప్రకటించారు. ఈ మేరకు భేటీలో భాగంగా తాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఫోన్లో మాట్లాడినట్లు పవార్ పేర్కొన్నారు. సిన్హా అభ్యర్థిత్వానికి తాను మద్దతు ఇస్తున్నట్లు కేసీఆర్ చెప్పారని ఆయన వెల్లడించారు.