తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగంగా ఉన్నపుడు సమైక్య పాలకులు వివక్ష చూపితే, స్వరాష్ట్రంలో కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరించడం విచారకరం.
తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళ నుంచే ఈ వివక్ష ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కు కట్టబెట్టింది. దీనివల్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును మనం కోల్పోయాం. దీంతో కేంద్రం అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ బంద్ పాటించాల్సి వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆనాటి నుంచి నేటివరకూ మన రాష్ట్ర హక్కుల సాధనకు కేంద్రంతో ఏదో రకంగా పోరాటాన్ని కొనసాగించాల్సి వస్తున్నది.
ఐదేళ్ళపాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసింది. మన హైకోర్టు మనకు ఏర్పాటైన తరువాత అవసరమైన సిబ్బందిని, నిధులను, భవనాలను సమర్థవంతంగా సమకూర్చుకున్నాం. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి చేసిన కృషికి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశంసించారు.మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదు.
కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని నేనే స్వయంగా అనేకమార్లు ప్రధాన మంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యం. కరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షేభాన్ని ఎదుర్కొన్నదో అందరకీ తెలుసు. ఆ క్లిష్ట సమయంలో కూడా కేంద్రం రాష్ట్రాలకు ఒక్క నయా పైసా అదనంగా ఇవ్వలేదు. పైగా, న్యాయంగా రావల్సిన నిధులపై కూడా కోత విధించింది. కేంద్రప్రభుత్వం మన రాష్ట్రంలోని ఆనాటి 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించింది. కానీ, ఈ జిల్లాలకు రావాల్సిన నిధులు ఇవ్వడంలో తగని జాప్యం చేస్తోంది.కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటు ఇతర ప్రాత్సాహకాలు ఇవ్వాలని ఏ.పి పునర్వ్యవస్థీకరణ చట్టం పేర్కొంది. కానీ, కేంద్రం చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలు ఏవీ ఇవ్వలేదు. విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు చేసింది.
బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల విషయంలో అతీగతీ లేదు.తెలంగాణలో ఐ.టి.ఐ.ఆర్ ఏర్పాటు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేసింది. ఇది అమలుచేసి ఉంటే ఐ.టి రంగం మరింతగా పురోగమించి ఉండేది.ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించి వుండేవి.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు రాష్ట్రాల్లోని నియోజకవర్గాలను డీలిమిట్ చేయాలని స్పష్టంగా పేర్కొన్నది.
కానీ, ఇపుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండిస్తున్నది.ఇటీవల యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన మన వైద్య విద్యార్థులకు ఎదురయిన దుస్థితి మనకు తెలుసు. వీరంతా మన దేశంలోనే వైద్యవిద్య కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రికి నేను స్వయంగా లేఖ కూడా రాశాను.
మన రాష్ట్ర విద్యార్థుల వైద్యవిద్యకు అయ్యే ఖర్చును భరించడానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందనీ తెలియజేశాను. కానీ, కేంద్రం నుంచి దీనికి ప్రతిస్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం బధిర శంఖారావంగా మిగిలిపోవడం విషాదం. ఈ విషయంలో కేంద్రం ఉదాసీనతను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపిస్తున్నది.తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అసమర్థతతో చేతులెత్తేసిందన్నారు సీఎం కేసీఆర్