ప్రధాని మోదీ తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని.. పార్లమెంట్‌లో ఆమోదం పొందకముందే బిల్లును అమలు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మీటర్లు పెట్టాల్సిందేనని ముసాయిదా బిల్లులో ప్రస్తావించారని.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం అదనంగా ఎఫ్ఆర్‌బీఎం ఇస్తామంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏపీ ఒప్పుకుందని.. తెలంగాణ ఒప్పుకోలేదని కేసీఆర్ తెలిపారు. ఏపీలో ఇప్పటికే కొన్ని వ్యవసాయ కనెక్షన్‌లకు మీటర్లు పెట్టారని.. కేంద్రం పెట్టమని చెప్పకుండానే జగన్ పెట్టారా అని కేసీఆర్ ప్రశ్నించారు. శ్రీకాకుళంలో 25వేల మోటార్లకు మీటర్లు పెట్టారని.. ఈ మేరకు టెండర్లు పిలిచారన్నారు.
ప్రధాని మోదీ చెప్పేది ఒకటి.. చేసేదొకటి అని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. మోదీ అబద్ధాలు చెబుతున్నారని.. మిషన్ భగరీథ ప్రారంభోత్సవంలోనూ విద్యుత్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేశారన్నారు. గజ్వేల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణకు యూనిట్ విద్యుత్ రూ.1.10కే ఇస్తున్నట్లు మోదీ చెప్పారని… అలా ఎప్పుడైనా ఇచ్చారా? అని కేసీఆర్ నిలదీశారు. తన పక్కనే ఉండి అబద్ధం చెబుతున్నా మర్యాద కోసం తాను మాట్లాడలేదన్నారు. 40వేల మెగావాట్ల ప్రాజెక్టులు పూర్తయినా కేంద్ర ప్రభుత్వం కరెంట్ ఉత్పత్తి చేయనివ్వడం లేదని వివరించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి బీజేపీకి విరాళాలిచ్చే వారి నుంచి సౌర విద్యుత్ కొనిపించాలని చూస్తున్నారని మోదీపై కేసీఆర్ విమర్శలు చేశారు.