తెలంగాణ ఏర్పాటు అనేది దేశ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగించారు. తెలంగాణ తొలిదశలో ఉద్యమంలో తానూ కూడా లాఠీదెబ్బలు తిన్నానని తెలిపారు. వివక్ష, అన్యాయంతో తెలంగాణ నలిగిపోయిందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్నివిధాలుగా అన్యాయానికి గురైందని సీఎం కేసీఆర్ అన్నారు. సినిమాల్లో ఒకప్పుడు తెలంగాణ భాషను కమెడియన్లకు వాడేవారని.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష వాడితేనే హీరో క్లిక్ అవుతున్నాడని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా తెలంగాణ పోరాటం సాగిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ప్రతి రూపాయి తెలంగాణ ప్రజల కోసమే ఖర్చవుతుందని చెప్పారు. నీళ్లు తెచ్చుకున్నాం.. నిధులు తెచ్చుకుంటున్నాం.. నియామకాల పంచాయతీ మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్‌తో నడుస్తూనే ఉందని కేసీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఆస్పత్రి, వ్యవసాయ కాలేజీలో ఏపీ వాటా కోరడం అర్థరహితమన్నారు. కేంద్రం కూడా విభజన సమస్యల పరిష్కారంలో కాలయాపన చేస్తోందని కేసీఆర్ విమర్శించారు.