ఏ విషయం గురించైనా కేసీఆర్ మాట్లాడగలరు. అది కూడా అనర్ఘళంగా.. గంటల సేపు అందరినీ టీవీల ముందు కట్టిపడేసి తన వాయిస్, తన ఛాయిస్ వినిపించగలరు. ఈమధ్యకాలంలో చినజీయర్ తో కేసీఆర్ కు గ్యాప్ బాగా వచ్చిందనే ప్రచారం సాగుతోంది. అయితే సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ స్పందించారు. చినజీయర్‌తో తనకు గ్యాప్ ఉందని ఎవరన్నారు?. మీకు మీరు ఊహించుకుంటే ఎలా?. చినజీయర్‌తో గ్యాప్ పై స్పందించాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చేశారు.
ఎవరూ కూడా చినజీయర్ స్వామికి మధ్య అపోహలు సృష్టించే ప్రయత్నాలు ఏవీ చేయవద్దన్నారు. తమ మధ్య గ్యాప్ ఉందని మీకు ఎవరు చెప్పారని ఆయన మీడియా ప్రతినిధులను సూటిగా ప్రశ్నించారు. అంతకుముందే మేడారం వివాదంపై మాట్లాడుతూ చిన్నజీయర్ స్వామి కూడా స్పందించారు. ఎవరైనా ఏదైనా పని అప్పగిస్తే దాన్ని చిత్తశుద్దితో చేస్తానన్నారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించి తనకు ఆహ్వానం అందితే వెళ్తానన్నారు. ఆహ్వానం అందకపోతే తాను వెళ్లనన్నారు. ఎవరితోనూ పూసుకు తిరగాల్సిన అవసరం లేదన్నారు. ముచ్చింతల్‌లో నిర్వహించిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ దూరంగా వుండడం పలు అనుమానాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.
ముచ్చింతల్ కార్యక్రమానికి ముందు నుంచే ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం కూడా లేకపోలేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణ సమయంలో చినజీయర్ స్వామి ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేయడం, ఈ విగ్రహావిష్కరణకు మోదీ కన్నా అర్హులు భారతదేశంలో ఎవరూ లేరని కీర్తించారు. ఈ విషయం కేసీఆర్ కు కోపం తెప్పించిందనే ప్రచారం కూడా సాగుతుంది. తాజాగా యాదాద్రిగా యాదగిరిగుట్టను మార్చింది చినజీయర్ స్వామే. ఆలయ పున:నిర్మాణం అంతా ఆయన సూచనలు, సలహాలతోనే నిర్మించారు. యాదాద్రి పునప్రారంభం చినజీయర్ లేకుండా ఉద్ఘాటన జరుగుతుండడం గమనార్హం. ఇద్దరికీ గ్యాప్ లేదన్న కేసీఆర్ మాటల వెనుక పరమార్థం ఏంటో ఆయనకే తెలియాలి.