Falaknuma Express: యాదాద్రి భువనగిరి జిల్లా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనలో ఏడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం 18 బోగీల్లో ఏడు బోగీలు దగ్ధం కావడంతో రైలు 11 బోగీలతో సికింద్రాబాద్ చేరుకుంది. రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఓ ప్రయాణికుడు గమనించి చైన్ లాగడంతో అందరూ రైలు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే చార్జింగ్ పాయింట్ వద్ద ఓ వ్యక్తి సిగరెట్ తాగడం వల్లే మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Read also: Sai Pallavi: బ్యూటిఫుల్ లొకేషన్‌లో నేచురల్ బ్యూటీ..
ప్రయాణికుడు రాజు మాట్లాడుతూ.. S-4 అప్పర్ బెర్త్ లో కూర్చుని మొబైల్ పట్టుకుని ఉన్నాను. తలకి వేడిగా తగిలింది. బయట వేడి గాలి అనుకున్నాను. ఎదో కాలుతున్న వాసన వచ్చింది. అంతలోపు నా తల వెనక వైపు మంటలు వచ్చాయి. తల కింద పెట్టుకున్న నా బ్యాగ్కి మంటలు అంటుకున్నాయి. నా అపోసిట్ సైడ్ అప్పర్ బెర్త్ లో మా అమ్మ, కింద బెర్త్ లో చెల్లి, పెద్దమ్మ ఉన్నారు.. వాళ్ళను అలెర్ట్ చేసి.. బయటకు పరుగెత్తమని చెప్పాను. నా పక్కనే చైన్ ఉంది లాగాను.. ట్రైన్ ఆగలేదు. బలంగా చైన్ కి వేలాడి.. కింది వరకు లాగాను.. ఎప్పుడు ట్రైన్ ఆగింది. అప్పటికే మంటలు ఎక్కువ అయ్యాయి. చేతికి అందిన బ్యాగులతో కిందకి దిగేసాం.. కింద పడ్డాను. పట్టాలు తగిలి తలకు గాయం అయ్యింది. ఎవరికి వాళ్ళు అరుపులు, కేకలు పెడుతూ… దిగుతున్నారు. వృద్ధులు, పిల్లలు ఉన్న వాళ్లకు సాయం చేసి.. ట్రైన్ నుంచి కిందకు దింపాం. S-4 నుంచి S-5, S-6 కి దట్టంగా మంటలు, పొగలు వ్యాపించాయి..
Read also: Bhatti Vikramarka: మోడీ పర్యటన వల్ల తెలంగాణ కు ఉపయోగం లేదు
సిగరెట్ వల్ల అయితే ప్రమాదం జరగలేదు. కచ్చితంగా షార్ట్ సర్క్యూట్ కారణమని తెలిపారు. రాజు తల్లి పార్వతి మాట్లాడతూ.. బాత్రూమ్ దగ్గర సిగరెట్లు కొందరు తాగారు. బొగీలో పోలీసులు ఎవరూ లేరని అన్నారు. జనరల్ బోగీ కంటే దారుణంగా ఉంది. నా పక్కనే మంటలు వచ్చాయి. ఒక్కసారిగా అప్పర్ బెర్త్ నుంచి కిందకు దూకాను. పరుగులు పెట్టానని తెలిపారు. రాజు చెల్లి పావని మాట్లాడుతూ.. మంటలు, పొగలు ఇప్పటికీ కళ్ళ లో మెదులుతున్నాయి. రాత్రి అంతా నిద్ర లేదు.. ప్రాణాలతో బయటపడ్డాం చాలు అనిపిస్తోంది. రాజు పెద్దమ్మ ఇంటి నుంచి వస్తున్నా అని.. పప్పులు, తిండి గింజలు కట్టి పంపారు. డబ్బులు నా బ్యాగ్ లోనే ఉన్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకు నాది. సర్వం కోల్పోయినంత పనైంది. రాళ్ళు, ముళ్ళు గుచ్చుకున్నాయి. తలుచుకుంటేనే గుండె దడ పుడుతోంది.. ఇంకోసారి ట్రైన్ ఎక్కాలంటేనే భయంగా ఉందని తెలిపారు.