నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ కేసులతో వేధిస్తోందని అంటున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా పెట్టిన నేషనల్ హెరాల్డ్ పేపర్ పై బీజేపీ కేసులు పెడుతోందని విమర్శిస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ మల్లు బట్టి విక్రమార్క ఈ అంశంపై ఫైర్ అయ్యారు. కీసరలో జరుగుతున్న కాంగ్రెస్ చింతన్ శిబిర్ లో ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చి.. ప్రజాస్వామ్యం నిలబెట్టి కుటుంబం గాంధీలది అని.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడం జుగుప్సాకరం అని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడీ ఆక్టివేట్ అవుతుందని ఎద్దేవా చేశారు. కేంద్ర సంస్థలు ఈడీ, ఐటీలను బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ కుటుంబం ప్రయోగిస్తోందని అన్నారు.
నెహ్రు పెట్టిన పేపర్ నేషనల్ హెరాల్డ్ అని బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేఖంగా పెట్టిన పేపర్ కే నోటీసులు ఇస్తున్నారంటూ విమర్శించారు. ఇప్పటికే ఓ సారి కేసు పెట్టీ, ఏం లేదని వదిలేశారని.. మళ్లీ రాహుల్ గాంధీ పాదయాత్ర అనగానే ఈడీ కేసులు పెడుతుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తోందని విమర్శించారు. కక్ష సాధింపు ధోరణితో బీజేపీ వ్యవహరిస్తుందని బట్టి విమర్శించారు. మీ ఈడీ కేసులకు భయపడేది లేదని.. బెదిరింపులు, నోటీసులకు భయపడే పరిస్థితి లేదని అన్నారు. ఎల్టీఈఈ భయపెడితే కూడా బెదరలేని కుటుంబం గాంధీ కుటుంబం అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు కీసర వేదికగా ‘ చింతన్ శిబిర్’ నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో రాజకీయ, ఆర్థిక, సంస్థాగత, యువత, వ్యవసాయం, సామాజిక న్యాయం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో 2023 ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను, రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తోంది.