రాష్ట్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ బస్ స్టేషన్ లో ఓ తల్లి చిన్నారకి జన్మనిచ్చింది. ఆ చిన్నారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జీవితకాలం ఉచిత బస్ పాస్ మంజూరు చేసింది. డెలివరీ చేసి మానవత్వం చాటిన ఆర్టీసీ సిబ్బందికి ఘన సన్మానం చేసింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 16న కూమారి అనే గర్భిణీ, తన భర్తతో కలిసి భద్రాచలం బస్సు కోసం కరీంనగర్ బస్ స్టేషన్ కు వచ్చారు. ఆమెకు బస్ స్టేషన్ లో నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఈ లోగా నొప్పులు ఎక్కువ కావడంతో.. ఆర్టీసీ మహిళా సిబ్బంది ముందుకు వచ్చారు. చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. అనంతరం అంబులెన్స్ సాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కరీంనగర్ బస్ స్టేషన్ లో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి చీరను అడ్డుకట్టి కాన్పు చేసి మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వారిని ఘనంగా సన్మానించారు.
READ MORE: Swayambhu: ఏపీ అడవుల బాట పట్టిన ‘స్వయంభు’
సమయస్పూర్తితో వ్యవహారించి.. సకాలంలో కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్య సేవలను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని ప్రశంసించారు. బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిప్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.