BJP v/s TRS in Huzurabad: హుజూరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ బహిరంగ చర్చల సవాళ్ల నేపథ్యంలో కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయితే.. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి సవాల్ విసిరారు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, దీంతో.. ఓ భారీ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో.. బీజేపీ కూడా తగ్గేదేలే అంటూ పోటా పోటీగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు. కాగా.. ఎక్కడైతే బహిరంగ చర్చ అన్నారో ఆ ప్రాంతమంతా ఇరు పార్టీల జెండాలతో నిన్న (గురువారం) నిండిపోయాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గులాబీ, బీజేపీ ఒకరినొకరు దాడులకు పాల్పడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో.. వ్యవహారం కాస్త సర్దుమణిగింది.
read also: Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డి తప్పు చేశాడు..? అతని ముఖం చూడను..!
ఇవాళ మళ్లీ వాతావరణ హీట్ ఎక్కడంతో.. పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. దీంతో మండిపడ్డ బీజేపీ నేతలు చర్చకు సవాల్ విసిరి అరెస్టులు ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అనుమతి లేకుండా టీఆర్ఎస్ వేదిక ఏర్పాటు చేసుకోవడానికి.. జెండాలు కట్టుకోవడానికి పోలీసులు మద్దతిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. కేవలం బీజేపీ పార్టీ వాళ్లనే ఎందుకు అడ్డుకుంటూ, అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో అటెన్షన్ డైవర్ట్ చేసి, హుజూరాబాద్ లో అశాంతిని రాజేసేందుకు టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్తత నేపథ్యంలో.. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హౌజ్ అరెస్ట్ అయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకుని, ఇంటిచుట్టూ నలుమూలలా పోలీసులు భారీగా మోహరించారు.