తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న తెలంగాణ కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆ తరువాత కేంద్రం ప్రభుత్వం, బీజేపీ నేతలపై నిప్పులు చేరిగారు కేసీఆర్. అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఖండిస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. బీజేపిని, మోడీని చూసి కేసీఆర్ భయపడుతున్నారని, బీజేపీ పార్టీ ఎదుగుదలను కేసీఆర్ చూసి తట్టుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత రాష్ట్రంలో బీజేపీకి కొత్త ఉత్సాహం వచ్చిందని, బీజేపీ పార్టీ ఎదుగుదలను చూసి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని ఆయన ఎద్దేవా చేశారు.
Talasani Srinivas Yadav : బీజేపీ ముందస్తు ఎన్నికలు కోరుకుంటే మేము రెడీ
మోడీపై కేసిఆర్ చేసిన వ్యాఖ్యలు, వాడిన పదజాలం, భాషను ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కుటుంబంపాలన కొనసాగుతుందని, ఆ ఒక్క కుటుంబమే అభివృద్ధి చెందిందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. “బంగారు తెలంగాణ” చేస్తానన్న కేసీఆర్ “అవినీతి తెలంగాణ” గా మార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చందమామపై ఉమ్మితే మన మీదనే పడుతుందని కేసీఆర్ గ్రహించాలని, దేశంలో ఎక్కడా లేనివిధంగా డీజిల్, పెట్రోల్ ధరలు తెలంగాణలో ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు డీజిల్, పెట్రోల్ ధరలపై పన్నులు తగ్గించిందని, రాష్ట్రంలో కేసీఆర్‌కి ప్రజలు “బై..బై..” చెప్తారంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమన్న తరుణ్ చుగ్.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు.