హైదరాబాద్ లో బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా రేపు రాష్ట్రానికి బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ రానున్నారు. కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో వీరిద్దరి పర్యటన సాగనుంది. రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు స్థలాల పరిశీలన, సన్నాహకం సమావేశాన్ని నిర్వహించనున్నారు.ఇప్పటికే రాష్ట్ర నేతలతో ఏర్పాట్ల కమిటీని ఏర్పాటు చేశారు. జూలై నెలలో కార్యవర్గ సమావేశాలు జరనున్నాయి.రేపటి పర్యటన తర్వాత జాతీయ కార్యవర్గం సమావేశాపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జాతీయ కార్యవర్గ షెడ్యూల్ ను అనుసరించి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ లో మార్పులు చేర్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తెలంగాణపై బీజేపీ చాలానే ఆశలు పెట్టుకుని ఉంది. ఎలాగైనా తెలంగాణలో అధికారాన్ని సాధించాలని అనుకుంటోంది. 2019 ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలవడంతో పాటు దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాడటం కూడా ఆ పార్టీలో కష్టపడితే అధికారంలోకి రావచ్చనే ఆశలు చిగురించాయి. అందుకు అనుగుణంగానే బీజేపీ పెద్దలు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఇటీవల బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రావడం.. ఆ తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రావడం చూస్తే తెలంగాణపై బీజేపీ ఎంత ఫోకస్ పెట్టిందో తెలుస్తోంది. ఇక ఇటీవల ప్రధాని మోదీ కూడా హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహించారు. కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు.