Site icon NTV Telugu

Etela Rajender : సఫాయి కర్మచారుల సంక్షేమంపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

Etela

Etela

Etela Rajender : ఢిల్లీలో బీజేపీ ఎంపీల బృందం కేంద్ర మంత్రులను కలిసి పలు సమస్యలను ప్రస్తావించింది. ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సఫాయి కర్మచారుల సమస్యల నుండి రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల వరకు విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈటల రాజేందర్ మాట్లాడుతూ, సఫాయి కర్మచారీలు కేవలం 40 ఏళ్లకే అనేక ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న పరిస్థితి చాలా బాధాకరమని అన్నారు. కరోనా సమయంలో వీరి సేవలను గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వారి కాళ్లు కడిగి సత్కరించారు. అయితే, చనిపోయిన సఫాయి కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలనే ప్రతిపాదన అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈటల రాజేందర్ తదుపరి రైల్వే మంత్రిని కలిసి తమ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను వివరించారు. సుచిత్ర వద్ద MMTS స్టేషన్ ఏర్పాటు అవసరమని, అలాగే రక్షణ శాఖకు సంబంధించిన కొన్ని అంశాలపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో చర్చించినట్లు తెలిపారు. తమ నియోజకవర్గంలో రైల్వే అండర్ పాస్‌లు, ఓవర్ బ్రిడ్జిల కొరత కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వందే భారత్ రైలు స్టాప్ ఏర్పాటు చేయాలని కూడా రైల్వే మంత్రిని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. హామీలు అమలు చేయలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉందని అన్నారు. హామీల అమలును నెరవేర్చేందుకు HCU భూములను అమ్మడం సరికాదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు చెందిన భూములు అమ్మితే నగరంలో పచ్చదనం మరింత తగ్గిపోతుందని హెచ్చరించారు. భూముల్లో పరిశ్రమలు, విద్యాసంస్థలు ఏర్పాటవ్వాలి కానీ, భూముల విక్రయం మాత్రం అప్రజాస్వామికమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Donald Trump: ట్రంప్ దెబ్బకు ఫార్మా ఇండస్ట్రీ విలవిల!

Exit mobile version