BJP MP Laxman Says Both TRS and Congress Parties Playing Games: కాంగ్రెస్, టీఆర్ఎస్ వేర్వేరు కావని.. ఆ రెండు పార్టీలు కలిసి నాటకమాడుతున్నాయని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ ఆరోపించారు. కుటుంబ పార్టీలు ఒకే వేదిక మీదకు రావాలని చూస్తున్నాయని.. కాంగ్రెసేతర, బీజేపీయేతర నేతలు ఒక్కటి అవుతున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్ తాయిలాలు ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అంటున్నారని.. కానీ ఎనిమిదేళ్ల నుంచి వారిని తెలంగాణ ప్రభుత్వం దగా, మోసం చేసిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా జీవో జారీ చేసి, గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా.. కేంద్రంపై ఆరోపణలు చేయొద్దని కోరారు. రాహుల్ గాంధీ భాష్యాన్నే సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
సచివాలయానికి రాని సీఎం కేసీఆర్.. ఇప్పుడు సచివాలయానికి డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి అవమానించాలని అనుకుంటున్నారని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. రజాకారులకు వ్యతిరేకంగా కేసీఆర్ ఒక్క మాట మాట్లాడకుండా ఉత్సవాలని నిర్వహించారని అన్నారు. లెఫ్ట్ పార్టీలు, ఏ ఇతర పార్టీలు ఏకమైనా.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు బీజేపీ వెంటే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో.. రాష్ట్ర రిజర్వేషన్లకు కేంద్ర ప్రమేయంతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర రిజర్వేషన్లు వేర్వేరుగా ఉంటాయని.. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు చేసుకునే స్వేచ్ఛ ఆయా రాష్ట్రాలకు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈనెల 17వ తేదీన ప్రధాని మోడీ పుట్టినరోజు జరుపుకోగా.. దాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 2 వరకు ‘సేవా పక్షం’ పేరుతో కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు.