జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. నేరస్తులను వదిలి, న్యాయం కోసం పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో దోషులను ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం అరాచకాలను పాతరేసే దాకా ఉద్యమిస్తూనే ఉంటామని ఆయన అన్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో తప్పు చేసిన నేరస్తులను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలతోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు నమోదు చేయడం గర్హనీయమని రాజాసింగ్ అన్నారు. ఈ అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా.. దోషులను ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు.? అని ప్రశ్నించారు. ఈ కేసులో టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉందని తెలిసినా ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కి వేసేలా కేసులు పెట్టడం టీఆర్ఎస్ అరాచకాలకు పరాకాష్ట అని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో అత్యాచారాలు, హత్యలు, అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని.. తాము ఏ తప్పు చేసినా చెల్లుపోతుందనే భావనతో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ చేతకానితనమే అని విమర్శించారు. నమ్మిన సిద్దాంతాల కోసం, పేదల పక్షాల పోరాడే తత్వం బీజేపీ సైనికులకే సొంతమని అన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ అరాచకాలపై పోరాడుతున్న తనపైనా కేసీఆర్ సర్కార్ అనేక కేసులు పెడుతోందని.. అయినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ బెదిరింపులు, పోలీసుల లాఠీఛార్జీలు, కేసులకు భయపడి వెనుకంజ వేసే ప్రసక్తే లేదని..దోషులను శిక్షించే వరకు బీజేపీ ఉద్యమిస్తూనే ఉంటుందని అన్నారు.