తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.. అయితే, ఇది డ్రామా అని కొట్టిపారేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి.. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్.. బీఆర్ఎస్ డ్రామా అంటూ కొట్టిపారేశారు.. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దీనిపై సీబీఐ విచారణకు కోరడం లేదు అని ప్రశ్నించారు.. అయితే, ఈ డీల్ డ్రామా వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు విష్ణువర్ధన్‌రెడ్డి..
Read Also: TRS MLAs Trap: పోలీసులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు.. అసలు ఏం జరిగిందంటే..?
ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు వాళ్లే… బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఎవరు లేరని తేల్చాశారు విష్ణువర్ధన్‌రెడ్డి.. నలుగురు ఎమ్మెల్యేలను కొంటె తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందా…? అని ప్రశ్నించిన ఆయన.. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు.. ఇక, వంద కోట్లు నగదు దొరికిందంటున్నారు… మరి మీడియా ముందు ఎందుకు చూపలేదు..? అని నిలదీశారు విష్ణువర్ధన్‌రెడ్డి.. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వెలుగు చూసిన తర్వాత హైదరాబాద్ శివారులోని ఆ ఫామ్ హౌస్ నుంచి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.. ఆ వెంటనే హరీష్‌రావు కూడా ప్రగతిభవన్‌కు రాగా.. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు.. నలుగురు ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా మాట్లాడినట్టు తెలుస్తోంది.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాత్రి ప్రగతిభవన్‌లోనే బస చేయగా.. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత సీఎం కేసీఆర్ ఎప్పుడైనా మీడియాతో మాట్లాడతారని ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందిస్తారనే ప్రచారం సాగుతోంది.