NTV Telugu Site icon

హుజురాబాద్‌ బైపోల్.. రేపే బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్‌

హుజురాబాద్‌లో ఉప ఎన్నికల వాతావరణం హీటెక్కిస్తోంది… ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ నామినేషన్‌ దాఖలు చేయగా… మరో రెండు ప్రధాన పార్టీలు కూడా రంగంలోకి దిగాయి… బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బలమూరి వెంకట్‌ రేపే నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.. రేపు ఈటల రాజేందర్‌ నామినేషన్‌ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు, బీజేపీ శ్రేణులు హాజరుకానున్నారు. ఈటల రాజేందర్‌ సిట్టింగ్‌ స్థానం కావడంతో.. బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.

ఇక, కాంగ్రెస్ అభ్యర్థిగా బలమూరి వెంకట్‌ రేపు మధ్యాహ్నం 12 గంటలకు హుజురాబాద్‌ పట్టణంలో నామినేషన్‌ దాఖలు చేస్తారని ప్రకటించారు టి.పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్… ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్ లతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, చైర్మన్ లు, డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు. మరోవైపు.. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలోకి దిగాయి.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ.. మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపగా.. టీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం సాగిస్తున్నారు.. పార్టీ ఇంచార్జ్‌లు, ఎమ్మెల్యేలు, నేతలు ఆయన తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక, అభ్యర్థిని కాస్త లేట్‌గా ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. మొత్తంగా హుజురాబాద్‌లో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది.