Bhoodan Movement: తన వంద ఎకరాల భూమిని పేదల కోసం దానమిచ్చి భూదానోద్యమానికి ఆద్యుడిగా నిలిచిన వెదిరె రామచంద్రారెడ్డికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ పోస్టల్ విభాగం ఆయన పేరు, ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ కవర్‌ని ఆవిష్కరించింది. ఈ కవర్‌ని హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి నిన్న రిలీజ్ చేశారు. వెదిరె రామచంద్రారెడ్డి 117వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కవర్ ప్రతిపాదనను రామచంద్రారెడ్డి కుమారుడు వెదిరె ప్రబోధ్‌చంద్రారెడ్డి పోస్టల్ అధికారుల దృష్టికి తీసుకురాగా వాళ్లు ఆమోదం తెలిపారు. దీనికైన ఖర్చును కూడా ఆయనే భరించటం విశేషం. ఈ సందర్భంగా పీవీఎస్ రెడ్డి మాట్లాడుతూ వంద ఎకరాల భూమిని దానం ఇవ్వటం చాలా గొప్ప విషయమని, ఈతరంవాళ్లు వెదిరె రామచంద్రారెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. రామచంద్రారెడ్డి 1905లో ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిలో జన్మించారు.
also read: 90 Years Old School Building: శిథిలావస్థలో 90 ఏళ్ళ స్కూల్ బిల్డింగ్
జాతిపిత మహాత్మాగాంధీకి ఆధ్యాత్మిక వారసుడిగా పేరొందిన స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ నరహరి భావే (ఆచార్య వినోభా భావే) 1951 ఏప్రిల్ 18న పోచంపల్లికి వచ్చారు. కొన్నాళ్లు అక్కడే ఉన్నారు. పోచంపల్లిలోని మొత్తం జనాభాలో మూడొంతుల మంది భూమిలేని నిరుపేదలని తెలుసుకున్నారు. వాళ్లంతా ఆయన్ని కలిసి భూమి కావాలని అడిగారు. అయితే.. ఇంత మందికి ప్రభుత్వమే ఎందుకు భూమి ఇవ్వాలి? భూస్వాములు తోటి పేదోళ్లకు సాయపడొచ్చు కదా అని సూచించారు.
దీంతో.. వెదిరె రామచంద్రారెడ్డి అనే భూస్వామి ముందుకొచ్చారు. తన వంద ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి, మాట నిలబెట్టుకున్నారు. ఈ పరిణామం ఏకంగా భూదానోద్యమానికే నాంది పలకటం గమనార్హం. తర్వాతి రోజుల్లో పోచంపల్లి అనే ఊరి పేరు భూదాన్ పోచంపల్లిగా ప్రసిద్ధి చెందింది. ఆ విధంగా వెదిరె రామచంద్రారెడ్డి చరిత్రలో నిలిచిపోయారు. తన కంటూ ఒక పేజీని రాసుకున్నారు. ఇన్నాళ్లకు.. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ ఆయన పేరు మీద ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల కావటం హర్షించదగ్గ అంశమని సామాజికవేత్తలు పేర్కొన్నారు.