సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర మళ్లీ మొదలుకాబోతోంది. చిన్ని బ్రేక్ తర్వాత… మళ్లీ పాదయాత్రకు సిద్ధమయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పీపుల్స్ మార్చ్ పేరుతో మొదలైన ఆయన పాదయాత్ర… తిరిగి కొనసాగనుంది. ఫిబ్రవరి 27న ముదిగొండ మండలం యడవల్లి నుంచి ప్రారంభమైన భట్టి పాదయాత్ర… ఈ నెల 5న గంధసిరి గ్రామం వరకు కొనసాగింది. సుమారు 102 కిలోమీటర్ల మేర నడిచారు భట్టి. అసెంబ్లీ సమావేశాల కారణంగా యాత్రకు బ్రేక్ వేశారు. సభ వాయిదా పడటంతో.. తిరిగి పాదయాత్రకు నడుంబిగించారు.
Read Also: Fuel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కొత్త రేట్లు ఇలా..
మధిర నియోజకవర్గంలోని చింతకాని, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని అన్ని గ్రామాలను చుట్టేయనున్నారు… భట్టి. ఇవాళ ముదిగొండ మండలం అమ్మపేటలోని శ్రీ వెలుగొండ స్వామి సన్నిధి నుంచి పాదయాత్రను పునః ప్రారంభించనున్నారు. వల్లాపురం మీదుగా చింతకాని మండలం నామవరం, మత్కేపల్లి, జగన్నాధపురం గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి జగన్నాధపురంలో బస చేస్తారు భట్టి. శనివారం చింతకాని, నరసింహపురం, అంతసాగర్, పందిలపల్లి, బొప్పారం, గాంధీనగర్ గ్రామాల్లో పాదయాత్ర కొనసాగించి… గాంధీనగర్ గ్రామంలో బస చేస్తారు. వచ్చే వారం రోజుల్లో వంద కిలోమీటర్ల పాదయాత్ర చేసేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు భట్టి. షెడ్యూల్ ప్రకారం.. యాత్ర కొనసాగనుంది.