ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని రావినూతల గ్రామం సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త సోలార్ విప్లవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం ప్రతి ఇంటిని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చడమేనని, ఇకపై ప్రజలు విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించే రోజులు పోయి, విద్యుత్ శాఖే ప్రజలకు డబ్బులు చెల్లించే రోజులు వచ్చాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అత్యంత భారీగా నిధులను వెచ్చిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 81 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేస్తుండగా, ఒక్క బోనకల్ మండల పరిధిలోనే 306 కోట్ల రూపాయలను కేటాయించారు. అందులోనూ రావినూతల గ్రామంలోని ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థల ఏర్పాటు కోసమే 24 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం.
Medaram: మేడారంలో ఆదివాసీల జీవన విధానం ఉట్టిపడేలా శిలాఫలకాలు
ఈ పథకం ద్వారా ప్రజలకు చేకూరే ఆర్థిక ప్రయోజనాలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రతి కుటుంబం తమ ఇంటిపై ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని, తమ అవసరాలకు వాడుకోగా మిగిలిన కరెంటును ప్రభుత్వానికి విక్రయించవచ్చు. ఇలా విక్రయించిన ప్రతి యూనిట్‌కు ప్రభుత్వం రూ. 2.57 పైసల చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. దీనివల్ల ప్రతి ఇంటికి ఏడాదికి సుమారు 15 వేల రూపాయల వరకు విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా, అదనపు విద్యుత్ అమ్మకం ద్వారా మరో 5 వేల రూపాయల వరకు నగదు ఆదాయం లభిస్తుంది. అంటే ప్రతి ఏటా ఒక కుటుంబం సుమారు 20 వేల రూపాయల ఆర్థిక వెసులుబాటును పొందుతుంది. ఈ మొత్తాన్ని మహిళలు తమ పిల్లల చదువులకో లేదా ఇతర ఇంటి అవసరాలకో వాడుకోవచ్చని భట్టి విక్రమార్క సూచించారు.
కేవలం గృహ వినియోగదారులకే కాకుండా, రైతులకు కూడా ఈ పథకం ద్వారా ‘డబుల్ ధమాకా’ లభించనుంది. పొలాల్లోని వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం తన సొంత ఖర్చుతో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తుంది. పంట లేని సమయంలో లేదా మోటార్లు వాడనప్పుడు కూడా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కలుగుతుంది. అంతేకాకుండా, ఈ సోలార్ ప్యానెళ్లను ఎనిమిది అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయడం వల్ల వాటి కింద ఒక పక్కా షెడ్డు లాంటి వసతి ఏర్పడుతుంది. అక్కడ రైతులు పశువులను కట్టుకోవడానికి, వ్యవసాయ పరికరాలు దాచుకోవడానికి లేదా మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి వీలుంటుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘గ్రీన్ ఎనర్జీ’ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, రైతులు కూడా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పొలాల్లో చెత్తను కాల్చవద్దని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు.
CM Switzerland visit: సీఎం అండ్ టీం బిజీబిజీ.. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చలు..!