Bhatti Vikramarka Fires On KCR and BRS Government: బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌లపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనంతా స్కాములమయమని ఆరోపించిన ఆయన.. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ 70 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని పేర్కొన్నారు. కొమురం భీమ్ జిల్లా రెబ్బెన కార్నర్ మీటింగ్‌లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది 4 కోట్ల ప్రజల కోసమా? కేసీఆర్ కుటుంబంలో ఉన్న నలుగురి కోసమా? అని ప్రశ్నించారు. సామాజిక తెలంగాణ నిర్మాణమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడిన గిరిజనుల ఆత్మగౌరవ బిడ్డ కొమరం భీమ్ స్ఫూర్తిని ఈ ప్రభుత్వం పాటించడం లేదని ఆరోపణలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించిన కొమరం భీం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల నుంచి పంట పొలాలకు వెళ్లాల్సిన కాలువలు తవ్వకుండ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని పేర్కొన్నారు. వట్టి ప్రాజెక్టు మెయింటెనెన్స్‌పై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వట్టి ప్రాజెక్టు కాలువలు పూడ్చుకుపోవడంతో 6500 ఎకరాలకు సాగునీరు అందని దుస్థితి ఏర్పడిందన్నారు.
Best Countries: ప్రపంచంలోని టాప్-10 ఉత్తమ దేశాలు (పనితీరులో)
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాల్లో ఒకటైన నీళ్ల లక్ష్యాన్ని కేసీఆర్ నీరుగార్చారని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తి చేసిన ప్రాజెక్టులకు కాలువలు తవ్వడానికి మిగులు బడ్జెట్ కలిగిన ధనిక రాష్ట్రంలో నిధులు లేవా? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టిన 18 లక్షల కోట్ల సంపద, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చిన ఐదు లక్షల కోట్ల సంపద ఎటు పోయింది? అని నిలదీశారు. తెలంగాణలో 86% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల బాగుకోసమే తెలంగాణ తెచ్చుకుంటే.. ఇప్పుడు ఆత్మగౌరవం కూడా దక్కని పరిస్థితి నెలకొందన్నారు. ధరణి పేరుతో భూములు లేకుండా చేశారని, గతంలో ఉన్న ఇళ్ల స్కీం లేదని, కార్పొరేషన్ ఎత్తివేశారని, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఇళ్లు రాలేదని, మూడేకరాల భూమిని బూచిగా చూపారని, అసైన్‌మెంట్ కమిటి కూడా లేదని మండిపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త చెరువు ఒక్కటి లేదన్నారు. ఓపెన్ కాస్ట్‌లు ఉండకుండా చేస్తామని చెప్పి, ఇప్పుడు అలా చేయలేదన్నారు. కేసీఅర్ ప్రభుత్వాన్ని వదిలించుకుంటే తప్ప.. రాష్ట్రం లక్ష్యాలు నెరవేరవన్నారు. రుణ మాఫీ చేయకపోవడం వల్ల.. బ్యాంకులకు రుణం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు.
Kolkata Knight Riders: కేకేఆర్ షాకింగ్ ట్విస్ట్.. కెప్టెన్‌గా ఊహించని పేరు
ప్రశ్నాపత్రాలు లీకేజీ సాధారణమని పేర్కొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్, మిషన్ భగీరథ స్కామ్‌లతో బీఆర్ఎస్ పాలన స్కాములమయం అయ్యిందన్నారు. రాష్ట్రంలో స్కామ్‌లు సరిపోలేదు అన్నట్లు.. ఢిల్లీకి పోయి స్కాం చేస్తున్నారన్నారు. కేజ్రీవాల్ స్కామ్‌లో కవిత భాగస్వామ్యం అయ్యిందని.. ఈ స్కామ్ కారణంగా దేశం తల దించుకుందని అన్నారు. లిక్కర్ స్కామ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీపై వేటు రాజ్యాంగ స్ఫూర్తిగా లేదన్నారు. ప్రజల సంపద ప్రజలకు చెందాలంటే.. బీజేపీ నేరం అంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని.. దీన్ని ప్రజాస్వామిక వాదులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.