Leaders dance to Natu Natu song in Bhadradri Kothagudem District: భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. కేంద్రం ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జాతీయభావం వెల్లివిరుస్తోంది. తాజాగా ఈ రోజు నుంచి ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ప్రారంభం అయింది. కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు తమ నివాసాల్లో జాతీయ జెండాను ఎగరవేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటు తెలంగాదణ ప్రభుత్వం కూడా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో మువ్వన్నెల పతాకం రెపరెపలాడుతోంది. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు వజ్రోత్సవ వేడుకలను ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం వజ్రోత్సవ వేడుకల్లో అపవిత్రం చేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు వజ్రోత్సవ కార్యక్రమాల్లో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. భారత దేశ స్వాతంత్య్ర స్ఫూర్తిని తెలియజేయాల్సింది పోయి సినిమా పాటకలు స్టెప్పులేస్తూ.. ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. బ్రిటీష్ పాలన నుంచి భారత్ స్వాతంత్య్రం పొందేందుకు ఎంత మంది వీరులు, త్యాగులు, నాయకులు కష్టపడ్డారో.. ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా విలువేంటో భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు.
తాజాగా కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో కొందరు ప్రజాప్రతినిధులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. వజ్రోత్సవ వేడుకల్లో సినిమా పాటలకు స్పెప్పులేశారు. అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు డ్యాన్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు జాతీయ జెండాలు పట్టుకుని డ్యాన్స్ చేశారు. జాతీయ జెండాల సాక్షిగా సినిమా పాటలకు స్పెప్పులేయడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశభక్తి గీతాలుకు బదులు సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ వజ్రోత్సవ వేడుకలను సినిమా ర్యాలీగా మార్చారనే ఆరోపణలు వస్తున్నాయి.