Munugode Congress :మునుగోడు కాంగ్రెస్‌కి అచ్చి రావడం లేదా..? అప్పట్లో పెద్దాయన.. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి సేమ్ టు సేమ్ సీన్ క్రియేట్ చేశారా? తాజా రాజకీయ వేడిలో ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారా? ఇంతకీ ఏ విషయంలో కాంగ్రెస్‌కు మునుగోడు కలిసి రావడం లేదు?
తెలంగాణ రాజకీయాలు మునుగోడుపై కేంద్రీకృతమైన వేళ.. కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మునుగోడు చరిత్రను కొందరు తవ్వి పోస్తుంటే.. ఇంకొందరు అక్కడ పార్టీల బలాబలాలు.. పూర్వం జరిగిన సంఘటలను కొత్తగా చర్చల్లోకి తీసుకొస్తున్నారు. అలా కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు వచ్చిన అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
మునుగోడు కాంగ్రెస్‌కి ఎప్పుడూ వివాదాలే తెచ్చిపెడుతుందనేది కొందరి వాదన. ఇప్పటి వరకు జరిగిన పరిణామలను అందుకు ఉదహరణగా చెబుతున్నారు కూడా. ఉమ్మడి రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కి కంచుకోట. 1967 నుండి ఇక్కడ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం వహించేవారు. ఆయన కాలం చేసే వరకు పాల్వాయి అడ్డా ఇదే. పైగా జిల్లాలో ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, పాల్వాయి లాంటి ఉద్ధండుల గ్రూపు రాజకీయాలు వాడీవేడీగా ఉండేవి. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. పాల్వాయి కూడా అప్పటి గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే వారు. పార్టీలో ఏం జరిగినా.. బయటకొచ్చి బహిరంగంగా మాట్లాడేసే వారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు కూడా ఇక్కడి నుండే వచ్చేవి. దీనికితోడు తెలంగాణ సెంటుమెంట్ పై పాల్వాయి ఒకింత దూకుడుతోనే ఉండేవారు.
మునుగోడులో అప్పట్లో పాల్వాయి గోవర్దన్ రెడ్డి.. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి. ఇద్దరి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయనేది పార్టీ నేతలు చెప్పేమాట. 2018 ఎన్నికల్లో మునుగోడు నుండి గెలిచిన రాజగోపాల్ రెడ్డి.. అసెంబ్లీలో అడుగుపెట్టిన కొద్దిరోజులకే కాంగ్రెస్‌కు తలనొప్పిలా మారారు. కాంగ్రెస్ అధిష్ఠానం.. రాహుల్ గాంధీల మీద విమర్శలు చేశారు. కేంద్రంలో పార్టీ బలహీన పడిందని.. తెలంగాణలో trsతో కొట్లాడే బలం బీజేపీకే ఉందని.. రాష్ట్రంలో బీజేపీ బలపడిందని చాలా వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్‌రెడ్డి. అప్పటి నుండి కాంగ్రెస్‌లో వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారడం ఒక ఎత్తు అయితే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ద్వారా కాంగ్రెస్‌ను మరింత ఇరకాటంలో పెట్టేశారు.
మునుగోడులో కాంగ్రెస్‌కు ప్రస్తుతం చాలా సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఎమ్మెల్యే కాగానే రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో పాల్వాయి టీమ్ లేకుండా చేశారు. అంతేకాదు. పాల్వాయి కుమార్తె స్రవంతిని సైతం రాజకీయంగా ఇబ్బంది పెట్టారనే వాదన ఉంది. అందుకే అప్పట్లో పాల్వాయి.. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి అని కాంగ్రెస్ రాజకీయాలు తెలిసిన వాళ్లు పొలికలు బయటకు తీస్తున్నారట. అధిష్ఠానంపై మాట్లాడే విషయంలో కానీ.. పార్టీని తప్పుపట్టే అంశంలో కానీ.. ఒకే విధంగా వీళ్ల వైఖరి ఉందని గుర్తు చేసుకుంటున్నారట. మునుగోడులో కాంగ్రెస్‌కు రాజకీయం సానుకూలంగా ఉన్నప్పటికీ.. హస్తం గుర్తుపై గెలిచిన నాయకుల తీరు వల్లే రచ్చ రచ్చ అవుతోందని అభిప్రాయపడేవాళ్లూ ఉన్నారు.