ఇటీవల బేగం బజార్‌లో చోటు చేసుకున్న నీరజ్ పరువు హత్య నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పరువు పోవడంతో పాటు అవమాన భారం తోనే నీరజ్ హత్య చేసినట్లు సంజన సొదరులు అంగీకరించారు. పెళ్లి , బాబు పుట్టాక యాదవ అహీర్ సమాజ కు చెందిన వ్యక్తులతో నీరజ్ రెచ్చగొట్టే వాఖ్యలు చేసినట్టు నిందితులు తెలిపారు. దీంతో యాదవ్ సమాజ్ లో జరిగే కార్యక్రమాలకి సంజన కుటుంబసభ్యులను పిలవకపోవడంతో.. సంజన కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళినా అవమాన భారంతో కృంగిపోయారు. అయితే.. గత ఏడాది ఏప్రిల్‌లో సంజన కు మరో అబ్బాయి తో నిచితార్థం చేశారు కుటుంబ సభ్యులు.
ఈ నేపథ్యంలో పెళ్లికి మూడు నెలల ముందు సంజన-నీరజ్‌లు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తమ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో కుటుంబ సభ్యులు కూతురు ఫోటోకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. బాబు పుట్టాక తన తల్లి తో మాట్లాడిన సంజనకు.. బేగం బజార్ కు రావద్దని సంజన తల్లి హెచ్చరించింది. అయినప్పటికీ.. తన తల్లి హెచ్చరిక ను లెక్క చేయకుండా బేగం బజార్ లోనే నీరజ్ సంజనలు నివాసం ఉంటున్నారు.
దీంతో ఎలాగైనా నీరజ్ ను హత్య చేయాలని ప్లాన్ చేసుకున్న నిందితులు.. గురువారం నిందితులు జుమేరాత్ బజార్ లో కత్తులు, రాడ్లు కొన్నారు. శుక్రవారం రాత్రి నీరజ్ కోసం ఒక బాలుడితో రెక్కీ చేసిన నిందితులు.. తన తాత తో బైక్ పై వెళుతున్న నీరజ్ కంట్లో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. అంతేకాకుండా.. ఘటనకు ముందు నిందితులు పీకల దాకా మద్యం సేవించినట్లు పోలీసులు వెల్లడించారు.