మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేడు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మూడవరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బోరవెల్లి గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను సీఎం కేసీఆర్ ప్రశాంతంగా ఉండనివ్వడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో సీఎ కేసీఆర్ చెలగాటమాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
పంటల సాగుకు సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలు చేయకుండా రకరకాల హామీలు ఇస్తున్నారని ఆ తరువాత మర్చిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వరి.. వేస్తే రైతులకు ఉరి అంటాడు.. మరోసారి సన్న వడ్లు వేయాలే అంటాడు.. మరోసారి దొడ్డు వడ్లు వేయాలే అంటాడు. ఇంకోసారి యాసంగిలో వడ్లు కొనం అంటాడు.. ఇలా పరిపరి విధాలుగా ముఖ్యమంత్రి తలతిక్క మాటలు మాట్లాడుతూ రైతులను గందరగోళంలో పడేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ఆదరణ తగ్గుతుందని భయపడి వడ్ల కొనుగోలు డ్రామాలు మొదలుపెట్టి రైతులకు వరి కోత పెట్టాలని విమర్శించారు.
2020-21వ సంవత్సరానికి సంబంధించి కేంద్రానికి ఇవ్వవలసిన 9.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. ఇటీవలనే కేంద్రం వడ్లు కొనడం లేదు మేము కొంటామని ప్రగల్భాలు పలికాడు. మూడు రోజుల క్రితం ఈనెల 13న యాసంగిలో పండిన వరి ధాన్యం అంతా కొనుగోలు చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిండు అని మీడియాకు ఓ లేఖను చూపారు. అన్ని కొంటానన్న మొనగాడు ఇప్పుడు కేంద్రానికి ఎందుకు లేఖ రాసిండో ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు.