ఇటీవల సీఎం కేసీఆర్ రాజ్యాంగం చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొత్త రాజ్యాంగాన్ని ప్రతిపాదిస్తున్నారని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.
రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ లీగల్‌సెల్ సభ్యులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కొత్త రాజ్యాంగాన్ని ఎందుకు ప్రతిపాదిస్తున్నారో చెప్పాలని, ఇప్పుడున్న రాజ్యాంగానికి ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించారు. “ఏదైనా సమస్య ఉంటే, రాజ్యాంగానికి సవరణలు చేసే అవకాశం ఉంది,” అని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు 105 సార్లు సవరించినా కొత్త రాజ్యాంగం అవసరం లేదని, ముఖ్యమంత్రి ప్రతిపాదనపై మేధావులు, న్యాయవాదులు, విద్యావేత్తలు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు.