కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సామాన్య ప్యాలెస్ లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు సాయం బాపురావు, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులు పాల్గొన్నారు. జిల్లాల్లో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రం చెప్పిందని, రాష్ట్ర ప్రభుత్వం ధ్వంద్వ విధానం అవలంబిస్తుందన్నారు. కేంద్రం కాన్ఫరెన్స్ పెడితే మేము ధాన్యం కొనం అని చెప్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు 62 వేల కోట్లు బకాయి ఉందని ఆయన వెల్లడించారు.
ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం భారీగా విద్యుత్ బిల్లు పెంచే కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ఏటా 6200 కోట్ల ఆదాయం వచ్చేలా ప్లాన్ చేశారని, 20 గ్రామాలకు ఉపయోగపడే విద్యుత్ కేసీఆర్ ఫామ్ హౌస్ కు ఫ్రీ గా వాడుకుంటున్నారన్నారు. ఎంఐఎం దాడి చేస్తుందనే పాత బస్తీలో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు సేకరిస్తున్నామని, త్వరలో వివరాలను బహిర్గతం చేస్తామన్నారు. కేసీఆర్ అబద్ధాల కోరు.. ఆయనది నోరు కాదు తాటి మట్ట అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అందుకే సీఎం కేసీఆర్ జిల్లాల టూర్లు చేస్తున్నారని ఆయన అన్నారు.