Bandi Sanjay Kumar Controversial Comments On CM KCR: గురువారం ప్రజాగోస – బీజేపీ భరోసా బైక్ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ఆయనకు ఎలక్షన్ ఫీవర్ కాదు, బీజేపీ ఫీవర్ పట్టుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ధాన్యం తడిసిపోవడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. పంటను కాపాడలేని సీఎం, ఇక ప్రజల్ని ఏం కాపాడుతారని ప్రశ్నించారు. రైతులకు కేసీఆర్ రుణమాఫీ చేయడం లేదని, తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల కోసమే ఈ ‘ప్రజాగోస – బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీ అని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో.. ఈడీ విచారణపై కాంగ్రెస్ నేతలు బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీపై చేస్తోన్న ఆరోపణలన్నీ అవాస్తవమని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ఆగస్ట్ 2 నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు.
కాగా.. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోన బీజేపీ, తాజాగా ఈ ‘ప్రజాగోస – బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీకి శ్రీకారం చుట్టింది. దాదాపు పది రోజులపాటు కొనసాగనున్న ఈ ర్యాలీ సందర్భంగా.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్ని చుట్టేయాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా.. ప్రజలు సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాల్ని బీజేపీ ఎండగట్టనుంది. ఆ సమస్యల్ని తాము పరిష్కరిస్తామని భరోసానిస్తూ.. తమకు అధికారం కట్టబెట్టాలని ప్రజల్ని విజ్ఞప్తి చేయడమే ఈ ర్యాలీ లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని గురువారం బండి సంజయ్ సిద్దిపేటలో ప్రారంభించారు.