రాజ్యసభ ఎంపీగా కే. లక్ష్మణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. ఈ సందర్భంగానే కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు కేంద్ర ఆహార సరఫరాల శాఖ కార్యదర్శి సుదాన్ష్ పాండేను కలిశారు. వారితో తాను తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లర్ అసోసియేషన్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత విధానాల వల్ల వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ‘ప్రధాని గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ పథకం కింద ప్రతి ఒక్కరికి ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తున్నామని చెప్పిన ఆయన.. బీజేపీ డిమాండ్ తర్వాతే జూన్ నెలలో కేసీఆర్ ఉచితంగా ప్రజలకు బియ్యం అందించారన్నారు.
గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద వచ్చే ఉచిత బియ్యాన్ని కెసిఆర్ పంపిణీ చేయడం లేదన్నారు. అందుకే మిల్లులో బియ్యం పేరుకుపోయాయని, పేరుకుపోయిన ఆ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్, మే నెలలో ఉచిత బియ్యం పంపిణీ చేయలేదని చెప్పిన బండి సంజయ్.. రైస్ మిల్లుల్లో బియ్యం సేకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను తాను కోరానన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, తగిన చర్యలు తీసుకుంటామన్నారని చెప్పారు. రైస్ మిల్లర్ సమస్యలకు సీఎం కేసీఆరే కారణమని, రైస్ మిల్లర్లను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ బియ్యం కొనట్లేదని, కేంద్రమే కొంటోందని వెల్లడించారు. అవసరమైతే రైస్ మిల్లర్ల అసోసియేషన్స్‌ను ఢిల్లీకే తీసుకొచ్చి మంత్రి పీయూష్ గోయల్‌ని కలిపిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.