తెలంగాణలో టీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్, బీజేపీలు వరుసగా మాటల దాడి చేస్తూనే వున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ పై మళ్ళీ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై సోమవారం తీవ్ర విమర్శలు చేశారు.
వేములవాడలో బండి సంజయ్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మహా శివరాత్రి అనేది అనుకోకుండా వచ్చే పండగ కాదు. వేములవాడలో శివరాత్రి సందర్భంగా ఒక సిస్టం లేదు. సీఎం ముందే నిధులు ఇచ్చి ఉంటే అన్ని పనులు సౌకర్యాలు కల్పించే వారు. తాగునీటి వసతి కూడా సరిగ్గా లేదు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో గవర్నర్ ఉంటారు. గవర్నర్ ను అవమానించడం దారుణం. మహిళను అవమానించడం సీఎం కేసీఆర్ కు అలవాటుగా మారింది. ఆహ్వానించక పోవడం సరైంది కాదు. గవర్నర్ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరించారు. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను పిలవకపోవడానికి కారణం ఏంటో కేసీఆర్ చెప్పాలి. సీఎం, మంత్రులు రాజ్యాంగ బద్ధంగా ప్రవర్తించాలి. లేకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.