ప్రశ్నించే వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్ జిల్లా పెరమాండ్ల గూడెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాడాన్ని తీవ్రంగా ఖండించారు. ల్యాండ్ పూలింగ్ పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం భూములను సేకరించాడన్ని వ్యతిరేఖిస్తే అరెస్ట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ, పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అమాయకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అమానుషం అని.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ వీడియో తీయడం..ఆ వీడియోను టీఆర్ఎస్ నేతలకు చూపిస్తూ రాక్షస పొందడం హేయమైన చర్యగా అభివర్ణించారు. సీఐ ఫోన్ చేసి బాధితులను ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరించడం.. రౌడీ షీట్ ఓపెన్ చేసి జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తానంటూ భయభ్రాంతులకు గురిచేయడం దారుణమని అన్నారు. బాధితుల కుటుంబ సభ్యులను ఉద్దేశించి పచ్చి బూతులు తిడుతూ సభ్యసమాజం తలొంచుకునేలా వ్యవహరించడం సిగ్గు చేటని బండి సంజయ్ అన్నారు.
ఈ ఘాతుకానికి పాల్పడ్డ సీఐ విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఐ భరత్ లను తక్షణమే సస్పెండ్ చేయాలని వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని..పోలీస్ స్టేషన్ లో సీసీ టీవీ పుటేజీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపిన అమాయకులపై అమానుషంగా వ్యవహరించిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చట్ట, న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే పార్టీ జిల్లా నాయకులు ఆ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి వాస్తవాలను సేకరిస్తోందని.. రేపు పార్టీ రాష్ట్ర శాఖ లీగల్ సెల్ టీం జిల్లాలో పర్యటించి వాస్తవాలను తెలుసుకుంటుందని.. న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ తీరును ప్రజాస్వామ్య వాదులంతా రాజకీయాలకు అతీతం ముక్త ఖంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంత పాలనకు చరమగీతం పాడేందుకు బీజేపీ చేస్తున్న ఉద్యమంలో భాగం కావాలని బండి సంజయ్ కోరారు.