చెంచల్ గూడ జైల్లో ఉండాల్సిన వారిని కాపాడటానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అత్యాచార ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ లు చేసి జైళ్లలో వేస్తున్నారని..అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు హోంమంత్రి పైనే ఆరోపణలు వస్తున్నాయి.. కానీ హోంమంత్రినే విచారణ చేయాలని ట్విట్టర్లో కొంతమంది మాట్లాడుతున్నారని విమర్శించారు. హోం మంత్రి, డీజీపి ప్రగతి భవన్ లోనే ఉంటారని విమర్శలు గుప్పించారు.
డ్రగ్స్ కేసులో కూడా ఇంత వరకు పోలీసులు సాధించిందేం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యాచార కేసులో నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటు…సీఎం చేతకాని తనం అని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ క్రిమినల్స్ కు అడ్డాగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ప్రమేయం లేకపోతే సీఎం కేసీఆర్ సీబీఐ విచారణ కోరాలని అన్నారు.
క్రిమినల్స్ ను కఠినంగా శిక్షించాలి తప్పితే పోలీసులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసుపై కాలయాపన ఎందుకు చేశారని.. నిందితులను ఎందుకు కాపాడాలని ప్రయత్నిస్తున్నారంటూ ప్రశ్నించారు. అమ్మాయి తనపై ఎవరు అత్యాచారం చేశారో చెప్పిందని.. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం బాధిత కుటుంబాన్ని ఒప్పించో, తప్పించో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమైన నాయకుల కుటుంబ సభ్యులను కేసు నుంచి తప్పించాలని.. వేరే పేర్లను పెట్టాలని సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చాయని ఆరోపించారు. ఇదే విధంగా అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.